బొలెరో – ఆర్టీసీ బస్సు ఢీ
తాడిమర్రి: మండలంలోని చిల్లకొండయ్యపల్లి సమీపంలో బొలెరో వాహనం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురికి స్వల్పగాయాలైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలమేరకు.. పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అనంతపురం నుంచి కడప వెళ్తోంది. అలాగే పార్నపల్లి నుంచి అరటికాయల లోడుతో బొలెరో బెంగళూరు వెళ్తోంది. అయితే చిల్లకొండయ్యపల్లి సమీపంలోని పులివెందుల బ్రాంచి కెనాల్ వద్ద బొలెరో – ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఘటనలో బాలుడితో పాటు ఇద్దరు మహిళలు, మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. సమచారం అందుకున్న ఏఎస్‌ఐలు గంగాధర్, సూర్యనారాయణరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నేటి నుంచి అండర్–19 కూచ్ బీహార్ ట్రోఫీ
అనంతపురం కార్పొరేషన్: రాయలసీమ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం నుంచి ఈ నెల 26 వరకూ అండర్ –19 కూచ్ బీహార్ ట్రోఫీలో భాగంగా ఆంధ్ర – ఓడిశా జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం జిల్లా క్రికెట్ సంఘం ఏర్పాట్లు చేసింది. ఇరు జట్ల క్రీడాకారులు శనివారం ముమ్మర సాధన చేశారు. ఇక్కడి పిచ్ మొదటి 15 ఓవర్లు బౌలింగ్‌కు, తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.


