కొడికొండ పాత చెరువుకు గండి
చిలమత్తూరు: కొడికొండ సమీపంలోని పాతచెరువుకు ఆదివారం గండి పడింది. తూము వద్ద గండి పడటంతో నీరంతా పంట పొలాల వైపు వెళ్లింది. గమనించిన రైతులు చెరువును పరిశీలించి ఇరిగేషన్ ఏఈ గౌతమ్ నారాయణకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఏఈ అక్కడకు చేరుకొని రైతులతో కలిసి గండిని పూడ్చివేయించారు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా మండలంలో చాలా చెరువులు ప్రమాదం అంచున ఉన్నాయి. వర్షాల సమయంలో గండ్లు పడి నీరు వృథా అయ్యే అవకాశం ఉంది. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
స్కేటింగ్ పోటీల్లో
తాడిపత్రి చిన్నారి ప్రతిభ
తాడిపత్రిటౌన్: అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో తాడిపత్రికి చెందిన చిన్నారి ముక్తేశ్వరి ప్రతిభ కనబరచింది. ఈ నెల 21 నుంచి 23 వరకు పుణెలో జరిగిన వరల్డ్ స్వీడ్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో 20 సెకన్ల రేసులో గోల్డ్‌మెడల్, 5 మినిట్స్, 2 మినిట్స్ రేసులో సిల్వర్ పతకాలు సాధించిందని కోచ్ శివ తెలిపారు. ఈ పోటీల్లో కెన్యా, నేపాల్, సౌదీ, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, బూటాన్, ఫిలిప్పీన్స్, ఇండియా, మయన్మార్ దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారన్నారు.
ఎస్కేయూలో ‘బర్డ్‌వాక్’
అనంతపురం: పర్యావరణ సమతుల్యతలో పక్షుల ప్రాముఖ్యతను గుర్తించడం, ప్రకృతి పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో ఆదివారం ఎస్కేయూ జువాలజీ విభాగం ఆధ్వర్యంలో బర్డ్‌వాక్ (పక్షుల వీక్షణ) నిర్వహించారు. ఈ సందర్భంగా జువాలజీ ప్రొఫెసర్లు విద్యార్థులకు స్థానిక, వలస పక్షుల జాతులను ఎలా గుర్తించాలో వివరించారు. పక్షులు అంతరించిపోతే పర్యావరణానికి జరిగే నష్టాన్ని వివరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై. భీమారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. పర్యావరణానికి పక్షులు స్నేహితులని, వాటిని కాపాడుకోడం ద్వారా మన భవిష్యత్తును కాపాడుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో జువాలజీ విభాగం అడ్‌హక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
కొడికొండ పాత చెరువుకు గండి
కొడికొండ పాత చెరువుకు గండి


