
తీవ్ర ఒత్తిడితో అలసిపోతున్న బ్రెయిన్
యుక్త వయసులోనే చాలా మందికి పక్షవాతం
పాతికేళ్లలోపు వయసున్న వారూ బాధితులే
అవగాహన లోపంతో సమస్య తీవ్రం
ఆహార అలవాట్లు.. జీవనశైలే కారణమంటున్న వైద్యులు
● ధర్మవరానికి చెందిన 35 ఏళ్ల చేనేత కార్మికుడు చేయి ఉన్నట్టుండి పనిచేయలేదు. దీంతో ఆస్పత్రికి వెళ్లగా.. పరీక్షించిన వైద్యులు పక్షవాతం వచ్చినట్లు నిర్ధారించారు. అయితే సకాలంలో ఆస్పత్రికి వచ్చి ఉంటే పెను ప్రమాదం తప్పేదని తెలిపారు. కానీ నిత్యం మందులు వాడాలని సూచించారు. అనంతరం చిత్తూరు జిల్లాలో నాటువైద్యం చేయించుకున్నా.. ఫలితం లేకపోయింది. కాళ్లు, చేతులు నియంత్రణలోకి వచ్చినా.. మెదడులో సమస్యతో మాటలు సరిగా రావడం లేదు. దీంతో బెంగళూరులోని నిమ్హాన్స్‌లో చికిత్స చేయిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
● అనంతపురానికి చెందిన 46 ఏళ్ల మహిళ వ్యక్తిగత పని నిమిత్తం ఇటీవల పుట్టపర్తికి వచ్చారు. ఉన్నఫలంగా కింద పడిపోగా ఎవరూ గుర్తించలేదు. రాత్రంతా వైద్యం అందక గదిలోనే ఉండిపోయింది. తెల్లవారిన తర్వాత శ్రీసత్యసాయి జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పక్షవాతం వచ్చినట్లు తేల్చారు. అయితే అప్పటికే ఆలస్యం జరిగిందని.. నిత్యం మందులు వాడాల్సిందేనని పేర్కొన్నారు. అనంతరం ఆమె డిశ్చార్జ్ అయి అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పది రోజులు చేరారు. ఇప్పటికీ కాళ్లు, చేతులు నియంత్రణలో లేనట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
...ఇలా జిల్లాలో రోజూ ఎక్కడోచోట పక్షవాతం కేసులు బయటపడుతున్నాయి. ఒత్తిడితో కూడిన జీవనం...మద్యపానం, ధూమపానం, నిద్రలేమి తదితర సమస్యలతో మొదడు మొద్దుబారిపోతున్నట్లు తెలుస్తోంది.
సాక్షి, పుట్టపర్తి: ఉన్నట్టుండి శరీరం బిగుసుపోవడం, మూతి వంకర తిరగడం, కాళ్లు, చేతులు చచ్చుబడి పోవడం, ఒక్కోసారి గుండె కూడా పని చేయకపోవడం.. ఇలా శరీరంలో ప్రతి అవయవంపై ప్రభావం చూపుతున్న వ్యాధి పక్షవాతం. అప్పటి వరకు ఆనందంగా సాగిపోతున్న వారి జీవితాలను ఆకస్మాత్తుగా కుప్ప కూల్చేస్తోంది. వారి బతుకులను ఉన్నట్లుండి అంధకారంలోకి నెట్టేస్తోంది. పక్షవాతానికి గురైన కొందరు దివ్యాంగులుగా మిగిలిపోయి.. తీవ్ర అవస్థలు పడుతూ బతుకు బండి లాగుతున్నారు. ఇంకొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
ఆహారపు అలవాట్లలో మార్పుతోనే..
మారిన ఆహారపు అలవాట్లు, రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకోవడంలో నిర్లక్ష్యం, వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించకపోవడం, సరైన సమయంలో తగిన వైద్యం పొందకపోవడంతో ఎక్కువ శాతం మంది పక్షవాతం బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గతంలో ఎక్కువగా వృద్ధులు పక్షవాతానికి గురయ్యేవారని, ఇప్పుడు బాధితుల్లో పాతికేళ్ల లోపు వారూ ఉండటం ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు.
ముందస్తు సంకేతాలు ఇవే..
పక్షవాతాన్ని ఆంగ్లంలో పెరాలసిస్, వైద్య పరిభాషలో బ్రెయిన్ స్ట్రోక్ అని పిలుస్తారు. మెదడుకు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడినప్పుడు కొన్ని లక్షణాలు బయటపడుతాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి మెదడుకు రక్త సరఫరా తగ్గడంతో శరీరంలో తిమ్మిర్లు, ఒక కాలు, చేతిలో శక్తి తక్కువైనట్లు అనిపిస్తుంది. పూర్తిగా లేదా సరిగా మాట్లాడలేకపోతారు. ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేరు. చూపు మసకబారుతుంది. నడవలేరు. తీవ్ర తలనొప్పితో బాధపడతారు. ఈ లక్షణాలు కనిపించిన మూడు గంటల్లోపు ఆస్పత్రికి తీసుకెళ్తే రక్త ప్రసరణను పునరుద్ధరించి మెదడు ఎక్కువగా దెబ్బ తినకుండా వైద్యులు కాపాడుతారు.
‘ఫ్యామిలీ డాక్టర్’ దూరమై.. సమస్య తీవ్రమై
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఫ్యామిలీ డాక్టర్ విధానంతో చాలా మందికి మేలు జరిగింది. ఇళ్ల ముంగిళ్లలోనే వైద్య సేవలు అందేవి. అలాగే డాక్టరే ఇంటి వద్దకు వచ్చి పరీక్షించి ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తిస్తే పరీక్షలు చేయించేవారు. ఫలితంగా జబ్బులను తొలిదశలోనే గుర్తించేవారు. వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల చాలా వరకు ఉపశమనం లభించేది. కానీ కూటమి ప్రభుత్వం ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి మంగళం పాడింది. దీంతో రక్తపోటు, మధుమేహం గురించి ప్రాణంమీదకు వచ్చాకే తెలుస్తోంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మెదడుకు చేటు చేసే బీపీ, షుగర్ పరీక్షలు ‘ఫ్యామిలీ డాక్టర్’తో నిత్యం జరిగేవి. అందువల్లే అప్పుడు పక్షవాతం కేసులు కూడా బాగా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
అవగాహన లోపంతోనే..
దేశంలో సగటున 10 శాతం మంది పక్షవాతం బారిన పడుతున్నట్లు పలు అధ్యయనాల ద్వారా తేలింది. అయితే అవగాహన లోపంతోనే చాలా మంది పక్షవాతం బారిన పడుతున్నారని తెలిసింది. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారిలో 30 శాతం మంది శాశ్వత వైకల్యం పొందుతున్నారు. బాధితుల్లో 25 శాతం మంది 30 ఏళ్ల లోపు వారు ఉండటం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. అలాగే 45 ఏళ్లు దాటిన వారిలో రిస్క్ ఎక్కువగా ఉంటోంది. మహిళల్లో 55 ఏళ్లు పైబడిన వారు ఎక్కువ ప్రమాదంలో పడుతారు.
జాగ్రత్తవివే
తరచూ బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి.
ఎక్కువ నీరసంగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రిలో చేరాలి.
గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడే వారు వైద్య పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
వెంటనే వైద్యులను సంప్రదించాలి
మద్యం, సిగరెట్లు తాగే వారికి పక్షవాతం సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అవగాహన కలిగి ఉండి వీలైనంత తొందరగా వైద్యులను సంప్రదిస్తే పక్షవాతం బారిన పడకుండా ఉండవచ్చు. ఇటీవల మధుమేహం, రక్తపోటు కారణంగా చాలా మంది యుక్త వయసులోనే పక్షవాతం బారిన పడుతున్నారు. ఆహార అలవాట్లూ చేటు తెస్తున్నాయి. – డాక్టర్ ఫైరోజాబేగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి