
గైనిక్ సర్జరీ ఎందుకు చేశారు?
డాక్టర్ సస్పెన్షన్
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ నాయక్‌ను సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. లావణ్య, శ్రీకృప పేరుతో ఆస్పత్రులను నడుపుతూ ఇతర విభాగాలకు సంబంధించి సర్జరీలు చేయడం, తదితర ఆరోపణలపై డాక్టర్ బి.రమణ నాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైద్య కళాశాల, సర్వజనాస్పత్రి అధికారుల అనుమతి లేకుండా జిల్లా కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదని కూడా స్పష్టంగా పేర్కొన్నారు.
అనంతపురం మెడికల్: గైనికాలజిస్టులు చేయాల్సిన సర్జరీని మెడికల్ టర్నినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) అనుమతులు లేకుండా ఎందుకు చేశావంటూ సర్వజనాస్పత్రి సర్జరీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ నాయక్‌ను విచారణ కమిటీ సభ్యులు ప్రశ్నించారు. ఇందుకు డాక్టర్ రమణ నాయక్ నుంచి మౌనమే సమాధానమైంది. బుక్కరాయసముద్రం మండలం చెదళ్ల గ్రామానికి చెందిన రాధమ్మ(29) మృతికి సంబంధించి డాక్టర్ రమణ నాయక్ ఎట్టకేలకు సోమవారం విచారణకు హాజరయ్యారు. విచారణ కమిటీ సభ్యులు ప్రొఫెసర్లు డాక్టర్ నవీన్‌కుమార్, డాక్టర్ షంషాద్‌బేగం, సర్జరీ డాక్టర్ మనోహర్‌రెడ్డి విచారణ చేపట్టి గంటలోపు పూర్తి చేసి నివేదికను జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ షారోన్ సోనియా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాంకు అందజేశారు. సర్జరీ జరిగే సమయంలో అధిక రక్తస్రావమైందని, ఆపేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని కమిటీ సభ్యులకు డాక్టర్ రమణ నాయక్ నివేదించినట్లు సమాచారం.
లోపించిన పారదర్శకత
కాగా, రాధమ్మ మృతిపై చేపట్టిన విచారణలో పారదర్శకత లోపించిందేనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సర్జరీలో డాక్టర్ రమణ నాయక్, అనస్తీషియా వైద్యురాలు డాక్టర్ లావణ్యతో పాటు శ్రీకృప ఆస్పత్రికి చెందిన మరికొందరు పాల్గొన్నారు. వాస్తవానికి పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌కు సంబంధించి సర్జరీలో పాల్గొన్న అందరినీ విచారణ చేపట్టాల్సి ఉండగా కేవలం డాక్టర్ రమణనాయక్, డాక్టర్ లావణ్యతో పాటు సర్జరీలో పాల్గొనని ఓ పీహెచ్‌సీకి చెందిన సిబ్బందిని బాధ్యులను చేస్తూ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈ భ్రమరాంబదేవి విచారణకు ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. గతంలో ఓ ఆస్పత్రిలో ఇలాంటి ఘటననే చోటు చేసుకుంటే యాక్ట్ ఉల్లంఘన కింద పోలీసులు కేసు నమోదు చేసి, బాధ్యులను జైలుకు పంపిన విషయాన్ని ఈ సందర్భంగా జీజీహెచ్‌లోని పలువురు గుర్తు చేసుకున్నారు. అయితే సర్జరీలో పాల్గొన్న శ్రీకృప ఆస్పత్రి స్టాఫ్‌నర్సులు, ఓటీ టెక్నీషియన్లు, తదితరులను తప్పించడం అనుమానాలకు తావిస్తోంది. పారదర్శకత లోపించిన ఈ అంశంపై కలెక్టర్ లోతుగా విచారణ చేపడితే అసలు దోషులు ఎవరైంది వెలుగుచూసే అవకాశముందని ఆరోగ్యశాఖ వర్గాలంటున్నాయి.
విచారణ కమిటీ సభ్యుల ప్రశ్నతో తడబడిన డాక్టర్ రమణ నాయక్