
ధర్మవరం అర్బన్: వివాహిత పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. ధర్మవరంలోని శారదానగర్ నివాసముంటున్న సాకే చందన, గణేష్ దంపతులు ఏడాదిన్నర క్రితం బత్తలపల్లిలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవారు. వ్యాపార లావాదేవీలన్నీ చందన చూసుకునేది. గణేష్ కియా కంపెనీలో పనిచేస్తూ రోజూ వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నివాసముంటున్న బోయ గోపాల్ తరచూ అంగడికి వస్తూ చందనతో మాటలు కలిపి ఆమె ఫోన్ నంబర్ సేకరించుకున్నాడు. అనంతరం పలుమార్లు చందనతో ఫోన్‌లో మాట్లాడాడు.
ఆ సమయంలో ఆమె మాటలను రికార్డు చేసి, వాటిని చందనకు వినిపించి, తనకు డబ్బు ఇవ్వాలని, లేకపోతే తన కోరిక తీర్చాలని బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. ఈ విషయాన్ని తన భర్తకు చందన చెప్పడంతో బత్తలపల్లి నుంచి ధర్మవరానికి మకాం మార్చారు. అయినా చందనను గోపాల్ ఇబ్బంది పెట్టడం మానలేదు. ఈ నెల 7న గణేష్ డ్యూటీకి వెళ్లిన సమయంలో 8వ తేదీ తెల్లవారుజామున చందన ఇంటికి గోపాల్ వెళ్లి తలుపులు గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె తలుపులు తీయగానే తనతో వస్తావా? రావా అంటూ బలవంతం చేస్తూ తన మాట వినకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఆ సమయంలో చందన గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకుంటుండగా గోపాల్ పారిపోయాడు. ఘటనపై బాధితురాలు సోమవారం ఉదయం టూ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం బోయ గోపాల్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు.