
పరిష్కార వేదికకు 55 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 55 వినతులు అందాయి. డీఎస్పీ ఆదినారాయణ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజరీ సాయినాథ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు
దళారీ మోసంపై ఫిర్యాదు
మామిడి ఫలసాయాన్ని కొనుగోలు చేసిన ఓ దళారీ రూ.14.25 లక్షలు చెల్లించకుండా మోసం చేశాడంటూ నల్లమాడ మండలం పెనుములకుంటపల్లికి చెందిన రైతు కేశవ వాపోయాడు. సోమవారం డీఎస్పీ ఆదినారాయణకు ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. మూడు నెలల క్రితం నల్లమాడ మండలం బడన్నపల్లి గ్రామానికి చెందిన నాగభూషణరెడ్డి తన మామిడి తోటలోని ఫలసాయాన్ని రూ.14 లక్షలకు కొనుగోలు చేశాడని గుర్తు చేశారు. మధ్యవర్తిత్వం వహిస్తూ అనంతరం రూ.14.25 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడని వివరించారు. ఫలసాయం మొత్తం మార్కెట్‌కు తరలించినా నేటికీ డబ్బు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడని వాపోయాడు. ఈ విషయంపై నల్లమాడ పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే వ్యాపారిని పిలిపించి పోలీసులు మాట్లాడారన్నారు. వారం రోజులు సమయం ఇచ్చినా సొమ్ము చెల్లించలేదని, ఇదేమని అడిగితే పోలీసులు సైతం సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ ప్రజాసమస్య పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినట్లు వివరించారు.