దత్తత అంశంలో నిబంధనలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

దత్తత అంశంలో నిబంధనలు తప్పనిసరి

Aug 12 2025 11:15 AM | Updated on Aug 13 2025 7:24 AM

దత్తత

దత్తత అంశంలో నిబంధనలు తప్పనిసరి

కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌

ప్రశాంతి నిలయం: పిల్లల దత్తత అంశంలో నిబంధనలు అనుసరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ ఆదేశించారు. పిల్లల దత్తత అంశానికి సంబంధించి మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫోస్టర్‌ అడాప్షన్‌ కేర్‌ పోస్టర్లను సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆవిష్కరించి, మాట్లాడారు. తల్లిదండ్రులు లేని ఆరేళ్లు పైబడి 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను రెండేళ్ల పాటు పెంచి ప్రేమానురాగాలు పంచిన అనంతరం శాశ్వత దత్తత కల్పించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, ఐసీడీఎస్‌ పీడీ ప్రమీల, సీడీపీఓ మహేష్‌, మిషన్‌ కోఆర్డినేటర్‌ గీతాబాయి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగాల కల్పన పేరుతో టోకరా

గార్లదిన్నె: ఆర్మీ, రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి నిరుద్యోగులను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం కనుంపల్లికి చెందిన సుధాకర్‌, రవిరాజా ఇద్దరూ అన్నదమ్ములు. 10 ఏళ్ల క్రితం గ్రామ సమీపంలోనే 44వ జాతీయ రహదారి పక్కన ఆర్మీ కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. కోచింగ్‌కు వచ్చిన నిరుద్యోగులకు ఆర్మీతో పాటు రైల్వే శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. దీంతో ఏడేళ్ల క్రితం గార్లదిన్నెకు చెందిన రవితేజ రూ.3 లక్షలు చెల్లించాడు. 2024లో శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం కట్టకిందపల్లికి చెందిన రామాంజనేయులు కూడా రైల్వేలో టెక్నిషియన్‌ ఉద్యోగం కోసం రూ.4లక్షలు ఫోన్‌పే ద్వారా చెల్లించి, మిగిలిన రూ.6లక్షలను నగదు రూపంలో చెల్లించాడు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ కార్యాచరణను అమలు చేసిన తర్వాత ఆర్మీ కోచింగ్‌ సెంటర్‌ను మూసివేశారు. ఈ క్రమంలో డబ్బులు చెల్లించిన ఇద్దరు నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు ఎప్పుడు ఇప్పిస్తారని సుధాకర్‌, రవిరాజాకు తరచూ అడుగుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో అనుమానం వచ్చిన వారు తాము కట్టిన డబ్బు వెనక్కు ఇవ్వాలని కోరారు. భూమి విక్రయానికి పెట్టామని, దానిని అమ్మిన తర్వాత డబ్బు ఇస్తామని వారు సర్దిచెప్పడంతో నమ్మారు. రోజులు గడుస్తున్నా వారు స్పందించకపోవడంతో తాము మోసపోయినట్లు నిర్ధారించుకుని సోమవారం గార్లదిన్నె పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ గౌస్‌ మహమ్మద్‌ బాషా పేర్కొన్నారు.

తాగుడుకు డబ్బివ్వలేదని ఆత్మహత్య

పరిగి: మద్యం తాగేందుకు డబ్బులివ్వకపోవడంతో క్షణికావేశంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పరిగి మండలం ఎన్‌ ముద్దిరెడ్డిపల్లికి చెందిన సీకే గంగాధరప్ప(44)కు భార్య రాధక్క, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో గంగాధరప్ప మద్యానికి బానిసయ్యాడు. రెండు రోజులుగా మద్యం తాగేందుకు కుటుంబసభ్యులను డబ్బులు అడుగుతూ వచ్చాడు. అయితే ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో తాగుడు మానేయాలని కుటుంబసభ్యులు సర్దిచెబుతూ వచ్చారు. దీంతో క్షణికావేశానికి లోనైన గంగాధరప్ప.. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో గ్రామ శివారులోని తన పొలంలో చెట్టుకు పంచెతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకునన పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. రాధక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఐ కేర్‌ సెంటర్‌పై దాడి కేసులో ఐదుగురి అరెస్ట్‌

అనంతపురం: ఈ నెల 9న అనంతపురంలోని అస్రా ఐ కేర్‌ సెంటర్‌పై దాడి చేసిన ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు రెండో పట్టణ సీఐ శ్రీకాంత్‌ యాదవ్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. పట్టుబడిన వారిలో శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమద్ది గ్రామానికి చెందిన శ్రీశైలం శివశంకర్‌, పాపిరెడ్డిపల్లికి చెందిన మురికి పృథ్వీ, రామగిరికి చెందిన ఆది ఆంధ్ర మారుతి, చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం నివాసి గండ్లూరి వెంకటరమణ, అనంతపురంలోని బుడ్డప్ప నగర్‌కు చెందిన బండారు అనిల్‌ కుమార్‌ ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.

దత్తత అంశంలో  నిబంధనలు తప్పనిసరి 1
1/1

దత్తత అంశంలో నిబంధనలు తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement