
యువకుడి దుర్మరణం
చిలమత్తూరు: ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లా నగరగెరె పట్టణానికి చెందిన శేఖర్ (26) మరో వ్యక్తితో కలసి ఆదివారం అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై కొడికొండ చెక్‌పోస్టు వద్ద 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపుగా రోడ్డు దాటుతున్న సమయంలో బెంగళూరు నుంచి వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
ఖాద్రీశుడి ఆలయ కమిటీ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలక మండలి సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు ఆలయ ఈఓ వి.శీనివాసరరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న వారు నిర్ణీత దరఖాస్తులను పూరించి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 6 గంటల్లోపు కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యాలయంలో అందజేయాలి. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవు.
డ్రైనేజీలో పడి
చేనేత కార్మికుడి మృతి
ధర్మవరం: పట్టణంలోని శ్రీదేవి థియేటర్ వద్దనున్న డ్రైనేజీలో పడి ఓ చేనేత కార్మికుడు మృతిచెందాడు. వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని పేట బసవన్నకట్టవీధికి చెందిన సపారు నాగరాజు(60) పట్టుచీరలను మడతలు వేసేందుకు వెళుతుంటాడు. ఐదేళ్ల క్రితం భార్య మృతి చెందింది. అప్పటి నుంచి నాగరాజు మద్యానికి అలవాటుపడ్డాడు. ఆదివారం రాత్రి మద్యం సేవించి శ్రీదేవి థియేటర్ సమీపంలో గ్రంథాలయం ఎదురుగా మురుగు కాలువలో పడిపోయాడు. రాత్రి వర్షం ఎక్కువగా రావడంతో కాలువలో నీటి ప్రవాహం ఎక్కువైంది. నాగరాజు నీటిలో మునిగి మృతిచెందాడు. సోమవారం ఉదయం పారిశుధ్య కార్మికులు కాలువను శుభ్రం చేస్తుండగా మృతదేహం కనిపించడంతో బయటకు తీశారు. స్థానికులు గుర్తించి మృతుని కుమారుడు మనోహర్‌కు సమాచారం అందించారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

యువకుడి దుర్మరణం