
ఆర్టీసీ స్థలాలను కాపాడుకుందాం : ఈయూ
పుట్టపర్తి టౌన్: ఆర్టీసీ స్థలాల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు చేపడతామని ఆ సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ స్థలాన్ని లూలూ షాపింగ్ మాల్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓ 137ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఏపీ పీడీటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర నాయకులు నబీరసూల్, నాగార్జునరెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరై, ప్రసంగించారు. విజయవాడలోని గవర్నర్‌పేట పాత బస్టాండ్‌కు సంబంధించిన 4.15 ఎకరాల భూమి రూ. 400 కోట్ల విలువ చేస్తుందన్నారు. ఈ స్థలాన్ని లూలూ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం 137 జీఓను విడుదల చేసిందన్నారు. ఈ జీఓను వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఉద్యోగులు, కార్మికులను కలుపుకుని ఐక్య ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. 2014లోనూ ఇలా కట్టబెడితే ధర్నాలు చేసి సంస్థ ఆస్తులను కాపాడుకున్నామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా... దశాబ్దాల చరిత్ర కలిగిన ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలు సాగిస్తుండడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో ఈయూ జిల్లా అధ్యక్షుడు వైపీ రావు, కార్యదర్శి శ్రీనివాసులు, కోశాధికారి రమణప్ప, నాయకులు శంకరప్ప, ఆదినారాయణ, రుక్మిణి, ఆదెన్న, ఆనంద్, హనుమాన్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.