ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై అర్జీల ద్వారా విన్నవించవచ్చని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు పరిష్కారం కాకపోతే 1100 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
నేడు పోలీస్ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. అర్జీదారులు తమ ఆధార్‌కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.
మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో గుబులు
చిలమత్తూరు: మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలపై ఆదివారం ‘సాక్షి’లో ‘దారుణాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గ్రామాల్లో రుణాలు పొందిన వారి వివరాలను ఆరా తీసినట్టు తెలుస్తోంది. దీంతో సదరు మైక్రో ఫైనాన్స్ సంస్థల యజమాన్యాల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.
మండలంలోని పలగలపల్లిలో రుణాలు తీసుకున్న వారికి మైక్రో ఫైనాన్స్ సంస్థల రికవరీ ఏజెంట్ల నుంచి ఫోన్ వచ్చినట్టుగా తెలిసింది. ‘మీరేనా పత్రికకు సమాచారం ఇచ్చింది’ అని పలువురిని బెదిరింపు ధోరణిలో ప్రశ్నించినట్టు తెలిసింది. రుణాలు పొందిన వారి నుంచి పోలీసులు, అధికార యంత్రాంగం వివరాలు సేకరించి సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధితులను బెదిరించిన వారిపై చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని ప్రజలు కోరుతున్నారు.
కూలిన వంతెన.. నిలిచిన రాకపోకలు
చెన్నేకొత్తపల్లి : గంగినేపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలోని వంతెన శనివారం రాత్రి కూలిపోయింది. దీంతో గంగినేపల్లి, ఎర్రోనిపల్లి, తండాలు, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో వంతెన కూలిందని గ్రామస్తులు తెలిపారు. ఆధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే వంతెన నిర్మించి రాకపోకలు పునరుద్ధరించాలని కోరుతున్నరు.
అప్రమత్తంగా ఉండాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చేతన్ సూచించారు. ఇప్పటికే జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజలకు సమస్యలు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశానని తెలిపారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మున్సిపల్, పోలీస్, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి టామ్ టామ్, మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యుత్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విపత్తు నిర్వహణ తదితర శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా ఆదుకోవడానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 08555 289039 నంబర్‌కు ఫోన్ చేసి సహాయం పోందవచ్చన్నారు.
అలరించిన సంగీత కచేరీ
ప్రశాంతి నిలయం: సత్యసాయిని కీర్తిస్తూ బాలవికాస్ చిన్నారులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేసిన తెలంగాణ సత్యసాయి భక్తులు ఆదివారం సాయికుల్వంత్ సభా మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ బాలవికాస్ చిన్నారులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను మంత్రముగ్ధులను చేసింది.

కూలిన వంతెన.. నిలిచిన రాకపోకలు