ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
ప్రశాంతి నిలయం: రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ద్వారా సమాచారమం అందిందని కలెక్టర్ చేతన్ తెలిపారు. మంగళవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా రెవెన్యూ సిబ్బంది మందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి మండల కేంద్రం, డివిజన్ కేంద్రాల్లో రెవెన్యూ సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎలాంటి నష్టం జరిగినా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని కోరారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 08555 289039 నంబర్‌కు సమాచారం అందించవచ్చని తెలిపారు.
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి
ప్రశాంతి నిలయం: తాము చేస్తున్న పనితో సంబంధం లేకుండా అరకొర జీతాలు చెల్లిస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతూ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ టీఎస్ చేతన్‌ను కలసి వినతి పత్రం అందజేసి, సమస్య వివరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 550 మంది తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలకు డ్రైవర్లుగా పనిచేస్తున్నారన్నారు. తమకు అరబిందో యాజమాన్యం చెల్లించే జీతం సరిపోవడం లేదన్నారు. గత 9 సంవత్సరాలుగా కేవలం రూ.8,800 వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, ఈ వేతనంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోగలమని ప్రశ్నించారు. ఔట్‌సోర్సింగ్ డ్రైవర్ల వేతనం రూ.18,500 చెల్లించాలని, పీఎఫ్ వాటాను యాజమాన్యమే భరించాలని, చట్ట ప్రకారం వారాంతపు సెలవులతో పాటు జాతీయ సెలవులనూ అమలు చేయాలని కోరారు. ఆరోగ్య బీమాతో పాటు, విధులలో మరణించిన డ్రైవర్లకు ఎక్స్‌గ్రేషియా అందజేయాలన్నారు.
పోక్సో కేసు నమోదు
రాప్తాడు: స్థానిక పంచాయతీ పరిధిలోని ముస్లీం మైనార్టీ కాలనీకి చెందిన ఓ బాలికను వేధింపులకు గురి చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు. కొన్ని నెలలుగా తమ కుమార్తెను ప్రేమ పేరుతో కదిరి మండలం బత్తలపల్లి గ్రామానికి చెందిన యువకుడు వేధిస్తున్నట్లు బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.


