ట్రాక్టర్ బోల్తా.. పలువురికి గాయాలు
హిందూపురం: స్థానిక ఇందిరమ్మ కాలనీ సమీపంలోని జాతీయ రహదారిలో గురువారం ఉదయం ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. అధిక లోడు కారణంగా వేగంగా వెళుతున్న సమయంలో కుదుపులకు బోల్తాపడడంతో ట్రాలీపై ఉన్న ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో గాయపడిన వారిలో కిష్టప్పకు కాళ్లకు బలమైన గాయలు కావడంతో చికిత్సలు అందిస్తున్నారు. ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
దాడి కేసులో
ఐదుగురికి జరిమానా
రొద్దం: వ్యక్తిపై దాడి చేసిన ఐదుగురికి జరిమానా విధిస్తూ పెనుకొండ ప్రిన్సిపుల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బొజ్జప్ప గురువారం తీర్పు వెలువరించారు. ఈ మేరకు ఎస్‌ఐ నరేంద్ర గురువారం వెల్లడించారు. రొద్దం మండలం రాచూరు గ్రామానికి చెందిన కురుబ అంజినరెడ్డి కుమార్తెను 2014లో రామగిరి మండలం కనివాండ్లపల్లి గ్రామానికి చెందిన కురుబ శివశంకర్ పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రసవానికి పుట్టింటికి వెళ్లిన భార్యను పలకరించేందుకు తరచూ రాచూరుకు శివకుమార్ వచ్చివెళ్లేవాడు. ఓ రోజు తన అత్త సుశీలమ్మతో ఇంటి బయట మాట్లాడుతున్న శివశంకర్‌పై రాచూరు గ్రామానికి చెందిన గొల్ల ధనుంజయ, రవి, సుధాకర్, పరంధామ, బోయ శ్రీరాములు దాడి చేసి గాయపరిచారు. ఘటనకు సంబంధించి 2015లో అప్పటి ఎస్‌ఐ దస్తగిరి కేసు నమోదు చేసి, ఛార్జీషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి రూ.6 వేలు చొప్పున జరిమానా, జరిమానా కట్టని పక్షంలో ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ శ్యామల వాదనలు వినిపించారు.


