ఆర్డీటీని కాపాడుకుంటాం
● కదం తొక్కిన ప్రజా సంఘాలు
బత్తలపల్లి: ‘ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యూవల్ చేసేదాకా పోరాడతాం...పేదల సంస్థ ఆర్డీటీని కాపాడు కుంటాం...సేవ్ ఆర్డీటీ’ అంటూ ప్రజా సంఘాలు కదం తొక్కాయి. బత్తలపల్లి మండల కేంద్రంలో మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా వారు ఆర్డీటీ వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెర్రర్ ఘాట్‌లో పూజలు చేశారు. అనంతరం ఆర్డీటీ ఆఫీసు నుంచి ప్రధాన కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు ప్రధాన కూడలిలో మానవ హారం ఏర్పాటు చేసి ‘సేవ్ ఆర్డీటీ’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదల పాలిట కల్పతరువుగా మారి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆర్డీటీ సంస్థకు నిధులు రాకుండా కట్టడి చేయడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యూవల్ చేయాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ స్వర్ణలతకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, ఎస్సీ జన సంఘం జాతీయ అధ్యక్షుడు దాసగానిపల్లి కుళ్లాయప్ప, ఎమ్మార్పీఎస్ ధర్మవరం డివిజన్ నాయకులు సాకే దండోరా లక్ష్మన్న, ఏపీ రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కమతం కాటమయ్య, ఎస్సీ జన సంఘం రాష్ట్ర ఇన్‌చార్జి రాంప్రసాద్, బహుజన సమాజ్ పార్టీ ధర్మవరం నియోజక వర్గ ఇన్‌చార్జి సాకే వినయ్‌కుమార్, సీపీఐ మండల కార్యదర్శి బండల వెంకటేష్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, ఎరుకల సంఘం మహిళా అధ్యక్షురాలు లక్ష్మీకాంతమ్మ, కుమ్మర శాలివాహన సంఘం నాయకులు వెంకట రమణ, నిడిగల్లు ధను, తాడిమర్రి, బత్తలపల్లి మండలాల ఆర్డీటీ ఉపాధ్యాయులు సుదర్శనం, రామకృష్ణ, వీరనారప్ప తదితరులు పాల్గొన్నారు.


