చోరీ కేసులో నలుగురి అరెస్ట్
మడకశిర: ఒంటరిగా వెళుతున్న వారిని అటకాయించి చోరీలకు పాల్పడే నలుగురిని అరెస్ట్ చేసినట్లు ప్రొబేషనరీ డీఎస్పీ ఉదయపావని, మడకవిర అప్‌గ్రేడ్ పీఎస్ సీఐ నగేష్‌బాబు తెలిపారు. స్థానిక పీఎస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వారు వెల్లడించారు. ఈ నెల 18న తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై పొలానికి బయలుదేరిన మడకశిర మండలం కల్లుమర్రి గ్రామానికి చెందిన శ్రీనివాసులు, సుభాషిణి దంపతులను దారి మధ్యలో అడ్డుకుని బంగారు, వెండి గొలుసులను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం కల్లుమర్రి గ్రామ సమీపంలో 544ఈ జాతీయ రహదారిపై ప్రొబేషనరీ డీఎస్పీ ఉదయపావని, సీఐ నగేష్‌బాబు పర్యవేక్షణలో సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై అటుగా వచ్చిన నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి వెనక్కు వెళ్లే ప్రయత్నం చేశారు. పసిగట్టిన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో ఈ నెల 18న సుభాషిణి మెడలోని బంగారు, వెండి గొలుసులను అపహరించిన విషయం వెలుగు చూసింది. పట్టుబడిన వారిలో కర్ణాటకలోని మధుగిరి తాలూకా బేడ్తూరు గ్రామానికి చెందిన హరీష్, నల్లకామనహళ్లికి రాకేష్‌బాబు, మడకశిర మండలం కల్లుమర్రి గ్రామానికి చెందిన రమేష్, పరిగి మండలం శ్రీరంగరాజుపల్లి నివాసి ఒకరు ఉన్నారు. వీరి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, ఓ బంగారు, మరో వెండి గొలుసును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
● ఊరంతా ఖాళీ...
సోమందేపల్లి: వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామస్తులు బుధవారం గ్రామాన్ని ఖాళీ చేసి పొలిమేరల్లో గడిపారు. ఏటా సజ్జగంట రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల అనంతరం ఈ ప్రక్రియను ఆనవాయితీగా పాటిస్తూ వస్తున్నారు. గ్రామంలోకి ఎవరూ ప్రవేశించకుండా ముఖద్వారం వద్ద ముళ్ల కంచె వేశారు. వ్యవసాయ పొలాలు, బావులు, చెట్ల కిందకు చేరుకుని వంటావార్పుతో సందడి చేశారు. సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకున్నారు.


