సరిహద్దున బ్లాక్‌ దందా | - | Sakshi
Sakshi News home page

సరిహద్దున బ్లాక్‌ దందా

Jan 10 2026 9:37 AM | Updated on Jan 10 2026 9:37 AM

సరిహద్దున బ్లాక్‌ దందా

సరిహద్దున బ్లాక్‌ దందా

సాక్షి, పుట్టపర్తి

ర్ణాటక సరిహద్దున నిఘా లేకపోవడంతో గుట్కా దందా, డీజిల్‌, పెట్రోల్‌ అక్రమ రవాణా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నాయి. రామగిరి, చెన్నేకొత్తపల్లి, తనకల్లు, గోరంట్ల, హిందూపురం, మడకశిర, చిలమత్తూరు తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. నెలవారీ ‘మామూళ్ల’తో అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పచ్చ నేతల సిండికేట్‌..

టీడీపీకి చెందిన కొందరు సిండికేటుగా మారి అక్రమ వ్యాపారాలకు తెరదీసినట్లు తెలుస్తోంది. కొందరు ఖాకీలు మామూళ్లకు అలవాటు పడటంతో అక్రమ వ్యాపారులు కాలర్‌ ఎగరేసి తిరుగుతున్నారు. ముఖ్యంగా నిషేధిత గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులు బెంగళూరు నుంచి నేరుగా హిందూపురం, మడకశిరకు వస్తున్నాయి. అక్కడి రహస్య ప్రాంతంలో సరుకు డంప్‌ చేసి గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. ఇక పెనుకొండ సమీపంలో ‘కియా’ కార్ల పరిశ్రమలో ఎక్కువగా ఉత్తరాది కార్మికులు పనిచేస్తుండటం...వారంతా గుట్కాలకు అలవాటు పడిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో గుట్కా విక్రయాలు విపరీతంగా జరుగుతున్నట్లు తెలిసింది.

గుట్టుచప్పుడు కాకుండా డీజిల్‌ దందా..

పెట్రోలు, డీజిల్‌ ఆంధ్రాతో పోలిస్తే కర్ణాటకలో లీటరుపై కనీసం రూ.7 తక్కువగా ఉంటోంది. దీంతో అధికార పార్టీలోని కొందరు నేతలు కర్ణాటక నుంచి డీజిల్‌, పెట్రోల్‌ను జిల్లాకు తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు. డీజిల్‌ పావగడ నుంచి రామగిరికి ఎక్కువగా రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల సమయంలో పోలీసుల నిఘా ఉండదన్న ఉద్దేశంతో ఆ సమయంలోనే అక్రమ రవాణా ఎక్కువగా సాగిస్తున్నట్లు సమాచారం. కొడికొండ చెక్‌పోస్టు నుంచి జాతీయ రహదారి మీద పలు చోట్ల డీజిల్‌ దుకాణాలు వెలిశాయి. వాటన్నింటిలో కర్ణాటకకు చెందిన ఇంధనమే అమ్ముతున్నట్లు సమాచారం.

నెలకు రూ.100 కోట్ల వ్యాపారం..

మత్తు పదార్థాలకు చాలా మంది బానిస కావడంతో గుట్టు చప్పుడు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో గుట్కాను అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. అదేవిధంగా కర్ణాటకలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు ఆంధ్ర కంటే తక్కువగా ఉండటంతో రాత్రిపూట తీసుకొచ్చి.. పగటి పూట అమ్ముతున్నట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా నెలకు రూ.100 కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు అంచనా. డిమాండ్‌కు అనుగుణంగా అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఇరుకు సందుల్లో అద్దెకు గదులు తీసుకుని గోదాములుగా వినియోగిస్తున్నారు. అక్కడి నుంచి ఏజెంట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల వరకు గుట్కా అక్రమంగా సరఫరా అవుతోంది. అదేవిధంగా కొడికొండ చెక్‌పోస్టు నుంచి పెనుకొండ, చెన్నేకొత్తపల్లి, ఎన్‌ఎస్‌ గేటు, మామిళ్లపల్లి వరకు డీజిల్‌ అమ్మకాల దుకాణాలు కనిపిస్తున్నాయి.

‘మామూళ్ల’ ముసుగులో అడ్డుకోకుండా..

నిషేధిత గుట్కా అక్రమ రవాణా జరుగుతున్నా.. పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నిందితులు పట్టుబడినప్పటికీ.. అరకొర జరిమానా విధించి వదిలేస్తున్నారు. దీనికి తోడు కొందరు అధికారులు మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు అధికారుల సహకారంతోనే గుట్కా అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నట్లు స్పష్టం అవుతోంది. అంతేకాకుండా కొన్ని చోట్ల సరుకు పట్టుబడినా.. అంతో ఇంతో డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారని ప్రజలే చెబుతున్నారు. రామగిరి ప్రాంతానికి చెందిన కొందరు టీడీపీ నేతలు సిండికేటుగా మారి డీజిల్‌, పెట్రోల్‌ అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది.

బెంగళూరు నుంచి విపరీతంగా

గుట్కా దిగుమతి

హిందూపురం, మడకశిర కేంద్రాలుగా విక్రయాలు

కర్ణాటక నుంచి విచ్చలవిడిగా

డీజిల్‌ దిగుమతి

‘పచ్చ’ నేతల ఆధ్వర్యంలో

డీజిల్‌, పెట్రోల్‌ వ్యాపారం

నెలకు రూ.కోట్లలో అక్రమ వ్యాపారం

నామమాత్రపు జరిమానాలతో

సరిపెడుతున్న అధికారులు

సరిహద్దులో ‘బ్లాక్‌’ దందా జోరుగా సాగుతోంది. జిల్లాలోని చాలా మండలాలు

కర్ణాటక సరిహద్దులో ఉండటంతో పొరుగు రాష్ట్రంలోని సరుకు యథేచ్ఛగా జిల్లాలోకి

వచ్చి చేరుతోంది. ముఖ్యంగా నిషేధిత గుట్కాతో పాటు డీజిల్‌, పెట్రోల్‌ సరిహద్దు

మండలాలను ముంచెత్తుతోంది. ఈ దందా అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే

జరుగుతుండటంతో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

నామమాత్రపు జరిమానాతో సరి..

నిషేధిత పొగాకు ఉత్పత్తులు, అక్రమ డీజిల్‌, పెట్రోల్‌ పట్టుబడితే అధికారులు కేసు నమోదు చేసి నామమాత్రపు జరిమానా విధించి వదిలేస్తున్నారు. దీంతో ఈ అక్రమ వ్యాపారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గుట్కా, ఖైనీ హోల్‌సేల్‌ వ్యాపారులు, డీజిల్‌ అక్రమంగా విక్రయించే వాళ్లు జిల్లా వ్యాప్తంగా సుమారు 70 మంది ఉన్నట్లు తెలిసింది. వీళ్లందరూ సరుకును కావాల్సిన ప్రాంతానికి పంపిస్తారు. అప్పుడప్పుడూ ఎవరైనా నిఘా పెట్టి పోలీసులకు ఫోన్‌ చేసినా.. ఏదో రూపంలో మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నారు. లేదంటే జరిమానా కట్టి వెళ్లిపోతున్నారు. అక్రమంగా సరుకు తరలిస్తూ ఎవరైనా పట్టుబడినా రూ.2 వేల నుంచి రూ.10 వేలలోపు జరిమానా విధిస్తున్నారు. దీంతో రూ.లక్షల్లో సంపాదించే వారికి రూ.వేలు లెక్క లేకుండా పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement