‘డబుల్ ట్రబులర్’ రమణరావుకు పోస్టింగ్
అనంతపురం టౌన్: డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి అనంతపురం నగరంలో భూ వివాదాలకు ఆజ్యం పోసి సస్పెండ్ అయిన జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ రమణరావుకు ఉన్నతాధికారులు మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు. డబ్బులు ఇస్తే చాలు ఎలాంటి రిజిస్ట్రేషన్లనైనా రమణరావు ఇట్టే చేసేస్తారు. ఆయన చేసిన అక్రమ రిజిస్ట్రేషన్లపై గత ఏడాది సెప్టెంబర్ 29న సాక్షి దినపత్రికలో ‘డబుల్ ట్రబులర్ రమణే’ శీర్షికన కథనం వెలువడడంతో విచారణ చేపట్టిన రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు అక్టోబర్ 7న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురంలో ఇష్టారాజ్యంగా ఆయన చేసిన రిజిస్ట్రేషన్లతో నేటికీ నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సస్పెండ్ అయిన ఉద్యోగులకు ఆరు నెలలు దాటిన తర్వాతే ఏ శాఖలోనైనా పోస్టింగ్ ఇస్తారు. అలాంటిది మూడు నెలలకే సస్పెన్షన్ ఎత్తివేసి జనవరి 4న చిత్తూరు జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రమణరావుకు పోస్టింగ్ ఇవ్వడంపై ఆ శాఖ ఉద్యోగులే నివ్వెర పోతున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారిని ప్రసన్నం చేసుకోవడంతో మూడు నెలల కాలంలోనే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నాడంటూ ఉద్యోగులలో చర్చ జరుగుతోంది. ఈ విషయంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ విజయలక్ష్మిని వివరణ కోరగా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు చిత్తూరు ఆర్‌ఓకు పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని ఆమె తేల్చి చెప్పారు.
అనంతపురంలో ఇష్టారాజ్యంగా
రిజిస్ట్రేషన్లు
భూ వివాదాలకు
ఆజ్యం పోసిన రమణరావు
సస్పెండ్ అయిన మూడునెలలకే
మళ్లీ విధుల్లోకి
ఐజీ కార్యాలయంలో
చక్రం తిప్పిన ఓ ఉన్నతాధికారి
చిత్తూరు ఆర్‌ఓలో జాయింట్–1
సబ్ రిజిస్ట్రార్‌గా పోస్టింగ్


