పనితీరు మెరుగుపడాలి
● సేవల్లో నిర్లక్ష్యం ఏ స్థాయిలోనూ
పనికిరాదు
● సచివాలయ ఉద్యోగులతో
కలెక్టర్ శ్యాంప్రసాద్
ప్రశాంతి నిలయం: ‘‘క్షేత్రస్థాయిలో ఉంటున్న సచివాలయ సిబ్బంది పనితీరు మరింత మెరుగుపడాలి. ప్రభుత్వ సేవల్లో ఎక్కడా ఆటంకం కలగకూడదు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవల్లో ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యం పనికిరాదు. మండల స్థాయి అధికారులు కూడా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందాలి’’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని వీసీ హాలు నుంచి ప్రభుత్వ పథకాల అమలు, సేవల మెరుగుదల తదితర అంశాలపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఈఓఆర్డీలు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలులో సిబ్బంది పారదర్శకంగా సంతృప్తి స్థాయిలో సేవలు అందించాలన్నారు. జిల్లా ర్యాంకింగ్ మెరుగుదలకు కృషి చేయాలన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ‘పరిష్కార వేదిక’కు వివిధ సమస్యలపై 300పైగా అర్జీలు అందుతున్నాయని, వాటి పరిష్కారానికి అంకిత భావంతో కృషి చేయాలన్నారు. రోజూ సచివాలయాల్లో సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకూ పీజీఆర్‌ఎస్ నిర్వహించాలన్నారు. ఎంపీడీఓలు, కమిషనర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. లేపాక్షి మండలం చోల సముద్రం, పుట్టపర్తి మండలం ఇరగరాజుపల్లి సచివాలయాల పనితీరు సరిగా లేదని తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ఉద్యోగులంతా తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందేనన్నారు. సేవలకు కుడా ప్రభుత్వం నిర్దేశించిన మొత్తానికి మించి రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లేఅవుట్ల సందర్శన, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. వీసీలో డీపీఓ సమత, జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి సుధాకరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు బస్సుల్లో
టికెట్ల ధర పెంచితే చర్యలు
● ఆర్టీఓ కరుణసాగర్‌రెడ్డి
పుట్టపర్తి టౌన్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సు యజమానులు అధిక ధరలకు టికెట్లు అమ్మితే చర్యలు తప్పవని ఆర్టీఓ కరుణసాగర్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి పండుగను కుటుంబీకులతో కలిసి జరుపుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది స్వగ్రామాలకు వస్తారని, ఆ సమయంలో డిమాండ్ పెరుగుతుందన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు బస్సు యజమానులు టికెట్ ధరలు ఇష్టానుసారం పెంచితే చర్యలు తప్పవన్నారు. ఆర్టీసీ నిర్ణయించిన టికెట్ ధర కంటే అదనంగా 50 శాతం వరకు టికెట్ ధర పెంచుకోవచ్చని, అంతకుమించితే ఆయా బస్సుల యాజమాన్యలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి బస్సులోనూ రవాణా శాఖ హెల్ప్‌లైన్ నంబర్ 9281607001ను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. జనవరి 16వ తేదీ వరకు అన్ని ప్రైవేటు బస్సులను తనిఖీ చేస్తామని, ప్రయాణికులతో మాట్లాడి టికెట్ ధరలు ఆరా తీస్తామన్నారు.
వీరభద్రుడి హుండీ ఆదాయం రూ.8.16 లక్షలు
లేపాక్షి: స్థానిక వీరభద్రస్వామి దేవాలయ ఆవరణలో శుక్రవారం ఆలయ ఈఓ నరసింహమూర్తి ఆధ్వర్యంలో హుండీ కానుకలను లెక్కించారు. ఏడు నెలలకుగాను రూ.8,16,064 ఆదాయం వచ్చిందని ఈఓ పేర్కొన్నారు. అయితే ఆలయ కమిటీ చైర్మన్ కరణం రమానందన్‌తో పాటు అతని అనుచరవర్గంతో హుండీ కానుకలను లెక్కించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు హుండీ లెక్కింపునకు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
పనితీరు మెరుగుపడాలి
పనితీరు మెరుగుపడాలి


