ముదిగుబ్బ: మండలంలోని ఎనుములవారిపల్లి వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో రెడ్డిపల్లి వీఆర్‌ఏ ప్రసాద్(38) దుర్మరణం పాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు... విధులకు హాజరయ్యేందుకు మలకవేమల క్రాస్ నుంచి రెడ్డిపల్లికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న ప్రసాద్‌ను నల్లమాడ వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. తలకు తీవ్ర గాయమై ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
రెడ్డిపల్లిలో విషాదఛాయలు
నల్లమాడ: వీఆర్‌ఏ ప్రసాద్ ఆకస్మిక మృతితో ఆయన స్వగ్రామం నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కదిరి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని రెడ్డిపల్లికి తీసుకొచ్చారు. భార్య, ఇద్దరు కుమార్తెలు రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. తహసీల్దార్ రంగనాయకులు, కార్యాలయ సిబ్బంది, వీఆర్‌ఏలు రెడ్డిపల్లికి చేరుకుని ప్రసాద్ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


