రొద్దం: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లూరు పంచాయతీ ఎంపీటీసీ సభ్యురాలు నాగమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2019 ఎన్నికల్లో మొత్తం 15 మంది ఎంపీటీసీ స్థానాలు ఉండగా 15 స్థానాలూ వైఎస్సార్‌సీపీ సభ్యులు గెలుపొందారు. గత ఏడాది ఎంపీపీ చంద్రశేఖర్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 14కు చేరింది. నాగమ్మకు మద్దతుగా మిగిలిన వారంతా చేతులెత్తారు. ఎన్నిక అధికారులు నాగమ్మను ఎంపీపీగా ప్రకటించారు. ఎన్నికల అధికారులు చేతుల మీదుగా ఆమె డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల ప్రొసిడింగ్స్ అధికారి విజయప్రసాద్, ఎంపీడీఓ రామ్‌కుమార్ పాల్గొన్నారు.


