నల్లచెరువు: స్థానిక జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన కేతప్ప (61) కాలి నడకన తిరుమలకు బయలుదేరాడు. గురువారం వేకువజామున నల్లచెరువు మండలం రాట్నాలపల్లి సమీపంలోకి జాతీయ రహదారికి ఓ వైపు నడుచుకుంటూ వెళుతున్న ఆయనను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఘటనలో కేతప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో సహా ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
హిందూపురం: జీవితంపై విరక్తితో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయబోతే సకాలంలో పోలీసులు గుర్తించి కాపాడారు. హిందూపురం సీఐ ఆంజనేయులు తెలిపిన మేరకు... లేపాక్షికి చెందిన ఓ మహిళ భర్త ప్రమాదంలో మృతిచెందడంతో అందిన పరిహారం డబ్బును కుటుంబ సభ్యులు తీసుకున్నారు. అందులో కొంత తన జీవనోపాధికి ఇవ్వాలని ఆమె కోరినా ఫలితం లేకపోయింది. దీంతో జీవనం దుర్భరమై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె... గురువారం హిందూపురం రైల్వే స్టేషన్‌కు చేరుకుని తన తల్లి మొబైల్ నంబర్‌కు మెసేజ్ పంపింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన గురించి ఎవరు వెతకరాదని, తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలంటూ అభ్యర్థించింది. దీంతో కంగారు పడిన తల్లి వెంటనే ఫోన్ చేయగా అప్పటికే స్విచ్ఛాఫ్ కావడంతో విషయాన్ని వెంటనే లేపాక్షి పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సాయి స్పందించి హిందూపురం రూరల్ ఆప్‌గ్రేడ్ సీఐ ఆంజనేయులుకు సమాచారం అందించాడు. బాధితురాలి సెల్‌ఫోన్ లాస్ట్‌సిగ్నల్ ఆధారంగా ఆచూకీని గుర్తించిన పోలీసులు వెంటనే హిందూపురం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై అడ్డంగా నిలబడిన ఆమెను గుర్తించి అధీనంలోకి తీసుకున్నారు. కౌన్సెలింగ్ అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రాణాలను కాపాడిన సీఐ ఆంజనేయులు, సిబ్బందిని ఎస్పీ రత్న అభినందించారు.
వేర్వేరు ప్రాంతాల్లో
ఇద్దరి ఆత్మహత్య
జిల్లాలోని వేర్వురు ప్రాంతాల్లో ఇద్దరు
ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఓ యువకుడు బలవన్మరణానికి
పాల్పడగా... కుటుంబ సమస్యల నేపథ్యలో
ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు..
● ధర్మవరం అర్బన్: స్థానిక గిర్రాజుకాలనీకి చెందిన బద్దెల ఓబునాథ్ (35) టైల్స్ వర్క్‌తో జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా ఉన్న ఓ యువతిని ప్రేమించిన ఓబునాథ్... తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఇందుకు ఆమె నిరాకరించడంవతో గురువారం ఇంట్లోనే గవాచీకి తన తల్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కుఏసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రెడ్డెప్ప తెలిపారు.
● గోరంట్ల: మండలంలోని బూదిలి ఎస్సీ కాలనీకి చెందిన విమల (23) ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి, కుటుంబసభ్యులు బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. దీంతో బూదిలిలోని ఎస్సీ కాలనీలో తన మామ కిష్టప్ప ఇంట్లోనే ఉంటూ గోరంట్లలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబ సమస్యలతో విసుగు చెందిన ఆమె గురువారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
హిందీ అమలుకు
కృషి చేయండి : డీఆర్‌ఎం
గుంతకల్లు: రాజభాష హిందీని అమలు చేయడం బాధ్యతగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా పిలుపునిచ్చారు. రాజభాష అమలుల్లో ప్రతిభ కనబరిచిన దాదాపు 51 మంది ఉద్యోగులకు గురువారం తన కార్యాలయంలో ఆయన ప్రశంసా ప్రతాలను అందజేసి, అభినందించారు. రాజభాషా నియమాలను అనుసరించి ఉద్యోగులు తమ కార్యాలయాల్లో విధి నిర్వహణలో తప్పనిసరిగా హిందీ మాట్లాడం అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సుధాకర్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ రామకృష్ణ, డివిజన్ రాజభాష అధికారి ఆశా మహేష్‌కుమార్ పాల్గొన్నారు.