గోరంట్ల: రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటైన తర్వాత టీడీపీ నాయకులు బరితెగించారు. సంపద సృష్టి పేరుతో ఇష్టానుసారంగా ప్రకృతి వనరులను దోచేయడం మొదలు పెట్టారు. చివరకు ప్రభుత్వ చింత వనం నుంచి అక్రమంగా మట్టి తరలింపులు చేపట్టడం టీడీపీ నేతల బరితెగింపులకు పరాకాష్టగా నిలిచింది. వివరాలు.. గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సర్వే నంబర్ 205లో 23 సంవత్సరాల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ సోమేష్ కుమార్ చొరవతో చింత– నిశ్చింత కార్యక్రమం కింద ప్రభుత్వ చింత వనం అభివృద్ధి చేశారు. ప్రస్తుతం చింత చెట్లు ఏపుగా పెరిగి ఫలసాయాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్‌తో కలసి టీడీపీ నేతలు కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే చింత వనం నుంచి మట్టి తరలింపులు చేపట్టారు. ఇందు కోసం హిటాచీలను రంగంలో దించారు. రేయింబవళ్లూ మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా రియల్టర్ల భూములకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న పెనుకొండ డివిజన్ నీటి పారుదల శాఖ డీఈ లక్ష్మీనారాయణ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మట్టి తవ్వకాలు సాగిస్తున్న హిటాచీని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై డీఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, టీడీపీ ముఖ్యనేత అండతో కొంత కాలంగా స్థానిక చోటా నాయకులు అక్రమంగా మట్టి తరలించి రూ. లక్షల్లో సొమ్ము చేసుకున్న వైనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ చింత వనం నుంచి
అక్రమంగా మట్టి తరలింపు
తవ్వకాలను అడ్డుకుని హిటాచీని పోలీసులకు అప్పగించిన ఇరిగేషన్ అధికారులు
టీడీపీ నేతల బరి తెగింపు