
మద్యాన్ని చూపుతున్న సెబ్ అధికారులు
హిందూపురం టౌన్: సి.చెర్లోపల్లిలోని ఏపీ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు https://bse.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఈ నెల 21న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షకు హాజరు కావచ్చు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ అశోక్ నాయక్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
కారు డ్రైవర్‌పై కేసు నమోదు
గుత్తి రూరల్: బైక్‌ను ఢీకొని ఇద్దరి మృతికి కారణమైన కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట్రామిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గుత్తి మండలం ఎంగిలిబండ శివారులో 67వ జాతీయ రహదారిపై ఈ నెల 10న చోటు చేసుకున్న ప్రమాదం తెలిసిందే. తాడిపత్రి వైపు నుంచి వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన అన్నదమ్ములు చంద్రశేఖర్‌రెడ్డి(26), శివానందరెడ్డి(24)లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల తండ్రి రామసుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు కారును నిర్లక్ష్యంగా, అతి వేగంగా నడిపి ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌పై ప్రస్తుతం సెక్షన్ 304–ఏ కింద కేసు నమోదు చేశారు. అయితే ప్రమాద సమయంలో కారు నడిపిన వారు ఎవరనేది విచారణ చేసి, వారిపై పూర్తి స్థాయిలో కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
వేర్వేరు ప్రాంతాల్లో
జూదరుల అరెస్ట్
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకూ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పెద్ద సంఖ్యలో జూదరులు పట్టుబడ్డారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు...
● అగళి: మండలంలోని కంబదపల్లి, హెచ్‌డీ హళ్లి గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో పేకాట ఆడుతున్న 12 మందిని బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ వీరేష్ గురువారం వెల్లడించారు. జూదరుల నుంచి రూ.38,900 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
● రొళ్ల: మండలంలోని ఎం.రాయాపురం గ్రామ పొలిమేరలో పేకాట ఆడుతున్న 11 మందిని గురువారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. నిందితుల నుంచి రూ.33 వేలు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.
● గుడిబండ: మండలంలోని బైరేపల్లి, మోపురగుండు గ్రామ పొలిమేరలో గురువారం పేకాట ఆడుతున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ మునిప్రతాప్ తెలిపారు. నిందితుల నుంచి రూ.21వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
అక్రమ మద్యం పట్టివేత
చెన్నేకొత్తపల్లి: మండలంలోని ముష్టికోవెల శివాలయం, పవర్‌స్టేషన్ వద్ద గురువారం ఉదయం సెబ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో రూ.లక్ష విలువ చేసే మద్యం పట్టుబడింది. మద్యం తరలిస్తున్న రాజు, ఆంజనేయులుని అరెస్ట్ చేసినట్లు సెబ్ సీఐ లలితాదేవి, ఎస్‌ఐ శివప్రసాద్ తెలిపారు. వీరి నుంచి 96 ప్యాకెట్ల కర్ణాటక మద్యం, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే కనగానపల్లి మండలంలో చేపట్టిన తనిఖీల్లో ఎరికల రామగోవిందు, నరసింహులు పట్టుబడ్డారన్నారు. వీరి ఉంచి 720 కర్ణాటక టెట్రాప్యాకెట్ల మద్యం, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
కర్ణాటక మద్యం పట్టివేత
హిందూపురం అర్బన్: స్థానిక పెన్నానది వంతెన సమీపంలో గురువారం రాత్రి సెబ్ అధికారుల చేపట్టిన తనిఖీల్లో హిందూపురానికి చెందిన వెంకటేష్ హోండా యాక్టివా వాహనంపై 9 బాక్సులు (864) కర్ణాటక మద్యం టెట్రా పాకెట్లు తరలిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సెబ్ సీఐ రాజశేఖర్‌గౌడ్ తెలిపారు. తనిఖీల్లో ఎస్‌ఐలు కమలాకర్, రామప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.
విద్యుదాఘాతంతో వివాహిత మృతి
సోమందేపల్లి: మండలంలోని కొత్తపల్లి సమీపంలో ఉన్న జగనన్న కాలనీ వద్ద విద్యుత్ షాక్‌కు గురై స్థానికురాలు రాధమ్మ (35) మృతి చెందింది. గురువారం ఉదయం కాలనీలోని తమ ఇంటి సమీపంలో ఉన్న పంచాయతీ బోరు వద్ద వంట పాత్రలు కడుగుతుండగా దెబ్బ తిన్న విద్యుత్ తీగ నుంచి కరెంటు సరఫరా అయి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. భర్త హనుమంతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.

మద్యాన్ని చూపుతున్న సెబ్ పోలీసులు

మృతురాలు రాధమ్మ