అనంతపురం కల్చరల్: ఈనెల 17 నుంచి 26 వరకూ భద్రాచలాన్ని తలపిస్తూ అనంత వేదికగా పది రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు వేడుకగా జరుగనున్నాయి. గురువారం స్థానిక మొదటి రోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశీకులు రామసుబ్రహ్మణ్యంతో పాటూ ధర్మకర్తల మండలి సభ్యులు నీలూరి సురేష్, సుబ్రహ్మణ్యం, తిమ్మారెడ్డి, వెంకటస్వామి, ప్రధాన అర్చకులు నరసింహశాస్త్రి, కిషోర్ తదితరులు ఉత్సవ వివరాలను తెలియజేశారు. నగర వీధుల్లో రోజూ సీతారాములు వివిధ వాహన సేవలతో ఊరేగింపుగా వెళ్లి భక్తులకు దర్శనమిస్తారు. ఈనెల 22న ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కల్యాణం, 24న శ్రీరాముడి పట్టాభిషేకం జరుగుతాయి.