9వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

చిలమత్తూరు: మండలంలో టేకులోడు క్రాస్‌లోని మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో 9 తరగతిలో ఏర్పడిన ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శశిభూషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ 9లో చేరేందుకు మొత్తం రెండు ఖాళీలుండగా ఎస్సీ–1, ఎస్టీ –1 సీట్లు ఉన్నాయన్నారు. ఈ నెల 12 వరకు దరఖాస్తుకు సమయం ఉందని, 20న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.
చెరువులో జారిపడి
గొర్రెల కాపరి మృతి
అమరాపురం: మండలంలోని కొర్రేవు గ్రామ గొల్లహట్టికి చెందిన వీరన్న కుమారుడు గొల్ల మంజునాథ (40) శుక్రవారం నిద్రగట్ట చెరువులోకి జారిపడి మృతి చెందారు. ఏఎస్‌ఐ రామంజనేయులు, గొల్ల కాపరుల వివరాల మేరకు... శుక్రవారం ఉదయం కొర్రేవు గొల్లహట్టి నుంచి స్నేహితులతో కలసి గొర్రెలను నిద్రగట్ట చెరువు వద్దకు తీసుకొచ్చారు. చెరువులో గొర్రెలను గొర్రెల కాపరులు ఈత చేయిస్తుండగా అకస్మాత్తుగా గొర్రెల కాపరి మంజునాథ చెరువులో కాలు జారి పడిపోయారు. అయితే అక్కడున్న గొర్రె కాపరులకు ఈత రాక పోవడంతో కట్టమీదకు వచ్చి దారిన పోయే వారిని పిలవగా వారు వచ్చి చెరువులోకి దిగి గాలించగా మంజునాథ అప్పుడే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య పవిత్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ రామంజనేయులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
హత్యాయత్నం చేసిన
వ్యక్తి మృతి
పరిగి: మండలంలోని ఊటుకూరులో మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేష్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసి, ఆపై పరిగి పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నరసింహమూర్తి అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. పరిగి ఎస్‌ఐ నరేంద్ర తెలిపిన వివరాలమేరకు... ఊటుకూరులో మాజీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేసిన మల్లేష్, అదే గ్రామానికి చెందిన నరసింహమూర్తి గత నాలుగు రోజుల క్రితం వ్యక్తిగత విషయంలో గొడవ పడ్డారు. అదే రోజు మల్లేష్‌పై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. రెండురోజుల క్రితం నరసింహమూర్తి పరిగి పోలీస్‌స్టేషన్ ముందు పురుగుల మందుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో అదే రోజు నరసింహమూర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నరసింహమూర్తిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుండెపోటుతో
యువతి మృతి
తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్తున్న ఓ యువతి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన అలిపిరి నడక మార్గంలో శుక్రవారం చోటుచేసుకుంది. తిరుమల పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన దివ్య (18) ఇంటర్ పూర్తిచేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు నడుచుకుంటూ బయలుదేరింది. గాలిగోపురం సమీపంలో వేగంగా నడుచుకుంటూ వచ్చిన దివ్య కూల్‌డ్రింక్ తాగిన తర్వాత గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందింది.