● ఆధారాల్లేవు..
అత్తింటి వారిపై కేసు కుదరదు
● నెల్లూరుకు చెందిన సంధ్య కేసులో
వీడిన పీటముడి
సాక్షి, న్యూఢిల్లీ: వరకట్న వేధింపుల కేసులో అత్తింటి వారిపై నమోదైన క్రిమినల్ అభియోగాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ కేడకోటి సంధ్య దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అత్తమామలు, ఆడపడుచుపై కేసును కొనసాగించడానికి తగిన ఆధారాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తూ జస్టిస్ కేవీ విశ్వనాథన్, అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే..
నెల్లూరుకు చెందిన గ్రామ కార్యదర్శి కేడకోటి సంధ్యకు తోట శ్రావణ్ కుమార్‌తో 2018లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.10 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఆడపడుచు కట్నం కింద రూ.50 వేలు ఇచ్చినట్లు సంధ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహం అనంతరం దంపతులు పుణెలో కాపురం పెట్టారు. అయితే నెల్లూరులోని తన తల్లి పేరుపై ఉన్న ఇంటిని భర్త పేరుపైకి మార్చాలని లేదా ఆ ఇంటిని అమ్మి అదనపు కట్నం తేవాలని భర్తతో పాటు మామ మోహన్‌రావు (ఏఎస్సై), అత్త మహేశ్వరి, ఆడపడుచు శ్వేతారాణి వేధించారని ఆరోపిస్తూ సంధ్య 2019లో నెల్లూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై సెక్షన్ 498ఏ, వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదైంది. అనంతరం 2022లో గృహ హింస చట్టం కింద మరో కేసు దాఖలు చేశారు.
హైకోర్టులో ఏం జరిగిందంటే..
తమపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ మామ, అత్త, ఆడపడుచు ఏపీ హైకోర్టులో వేర్వేరు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఏడాది జులై 28న తీర్పు వెలువరించింది. అభియోగాలు నిర్దిష్టంగా లేవని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. అయితే, అత్త మహేశ్వరి ఖాతాలోకి నేరుగా నగదు బదిలీ కావడంతో ఆమైపె వరకట్న నిషేధ చట్టం సెక్షన్లు 3, 4 కింద విచారణ కొనసాగుతుందని, భర్తపై అన్ని అభియోగాలు యథావిధంగా ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే, దంపతులు పుణెలో కాపురం ఉన్నందున అత్తమామలు, ఆడపడుచు వారితో కలిసి నివసించలేదని, కాలపరిమితి కూడా దాటిపోయిందని పేర్కొంటూ అక్టోబర్ 30న వారిపై ఉన్న గృహ హింస కేసును సైతం హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సంధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది.


