● టీడీపీకి అనుకూలంగా
పోలీసుల వ్యవహార శైలి
● అట్ల శ్రీనివాసులురెడ్డిపై ఎకై ్సజ్ కేసు
గూడూరురూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు పోలీస్ యంత్రాంగం వైఎస్సార్‌సీపీ వర్గీయులపై రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది. ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థులను లొంగదీసుకునేందుకు పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారు. గూడూరు మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. సంతదాసుపల్లి సెగ్మెంట్ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామలింగాపురం మాజీ సర్పంచ్ అట్ల సంపూర్ణమ్మను ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఇది మింగుడుపడని టీడీపీ నాయకులు ఎలాగైనా ఆమెను పోటీ చేయనీయకుండా కుయుక్తులు పన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నించారు. చివరకు ఆదివారం అర్ధరాత్రి రామలింగాపురంలోని అట్ల శ్రీనివాసులురెడ్డి నివాసానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రవేశించి అక్రమంగా మద్యం బాటిళ్లు ఉన్నట్లు వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న మహిళలను పిలిచి మద్యం బాటిళ్లు ఉన్నాయని, ఇంటి యజమానిపై కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. అయితే అంతకు ముందుగానే మహిళలతో పోలీసులు ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారా.. లేదా అని ఆరా తీశారు. సీసీ కెమెరాలు లేవని చెప్పడంతో పోలీసులు వారి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దీంతో అనుమానం వచ్చిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్యం బాటిళ్లు మీరే తీసుకొచ్చిపెట్టి, మీరే వీడియో తీసుకుని, ఇంట్లో నిద్రిస్తున్న మమ్మల్ని లేపి ఇందుకు సాక్షులుగా ఉపయోగించుకుంటారా? అంటూ ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు పోలీసులు చేస్తున్న రెక్కీని వీడియో తీసేందుకు ప్రయత్నిస్తే పోలీసులు సెల్‌ఫోన్లు లాక్కునే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులు సంపూర్ణమ్మ భర్త అట్ల శ్రీనివాసులురెడ్డిపై ఎకై ్సజ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
సునీల్ రాజ్యాంగం నడుస్తోంది
సమన్వయకర్త బూదూరు గురవయ్య
గూడూరు నియోజకవర్గంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం బదులు రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో పాశిం సునీల్‌కుమార్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అర్థరాత్రి రామలింగాపురంలో పోలీసులు చేసిన దుశ్చర్యలు తెలుసుకున్న గురవయ్య వెంటనే అట్ల శ్రీనివాసులురెడ్డి ఇంటికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. గురవయ్య మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు కొంత మంది వ్యక్తులతో మద్యం బాటిళ్లను పెట్టించి కేసులు పెట్టించాలని చూశారన్నారు. ఆ ప్రాంతంలో చుట్టు పక్కల వారు గమనించి పట్టుకుని నిలదీయడంతో అక్కడ కాపు కాచి ఉన్న పోలీసులు, రెవెన్యూ అధికారి ఏమీ తెలియని అమాయకులుగా పరారయ్యారన్నారు.


