● మండుతున్న నిత్యావసరాలు
● ౖపైపెకి ఎగబాకుతున్న బియ్యం ధరలు
● కిలో రూ.88కు చేరిన సన్నబియ్యం
● నెలరోజుల్లోనే కిలోపై
రూ.20 మేర పెరుగుదల
● పప్పులది అదే పరిస్థితి
● కోయకుండానే
కన్నీరు తెప్పిస్తున్న ఉల్లిపాయలు
● కొనకుండానే ఉడుకుతున్న కూరగాయలు
నెల్లూరు(పొగతోట): కూటమి ప్రభుత్వం సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. నిత్యావసరాల ధరలను కట్టడి చేయకుండా పెనుభారం మోపుతోంది. బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బియ్యం, పప్పుల ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఉల్లిపాయలు కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్నాయి. పెరిగిన ధరలను చూసి మింగను మెతుకూ కష్టమవుతోందని సామాన్యులు వాపోతున్నారు.
కొండెక్కిన పప్పులు
జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. 36 మండలాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 6.29 లక్షల గృహాలు ఉన్నాయి. 24.16 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట కేంద్రంగా జిల్లా వ్యాప్తంగా నిత్యావసర సరుకులు సరఫరా అవుతున్నాయి. కావలి, గూడూరు ప్రాంతాల నుంచి చుట్టుపక్కల గ్రామాలకు సరుకుల రవాణా చేస్తున్నారు. స్టోన్‌హౌస్‌పేటలో సుమారు వేయికిపైగా నిత్యావసర సరుకుల హోల్‌సేల్, రిటైల్ దుకాణాలు ఉన్నాయి.గతంలో ఎన్నడూ లేనివిధంగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం కందిపప్పు కేజీ రూ.150 నుంచి రూ.170 వరకు విక్రయిస్తున్నారు. మినపప్పు కేజీ రూ 120 నుంచి 130, పల్లీలు కేజీ రూ.180, చింతపండు కేజీ రూ.240లకు అమ్ముతున్నారు. పంచదార ధరలు సైతం విపరీతంగా పెరిగాయి. గత రెండు నెలల కిందట వరకు కేజీ రూ.37 నుంచి రూ.45 వరకు ఉండేది. ప్రస్తుతం కేజీ రూ.50 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. పాలు, పంచదార, టీ, కాఫీ పొడుల ధరలు పెరగడంతో టీ, కాఫీ సెంటర్లలో ధరలను సైతం పెంచారు. గతంలో టీ రూ.10 ఉండగా ప్రస్తుతం రూ.15కు పెంచారు.
బియ్యం ధరలకు రెక్కలు
బియ్యం ధరలు రోజురోజుకు పెరిగిపోతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిత్యావసర వస్తువుల్లో బియ్యం అత్యంత కీలకం. వాటి ధరల పెరుగుదల నేరుగా కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. గత నెలలో సన్నబియ్యం 25కిలోల బస్తా ధర రూ.1700 ఉండగా, ప్రస్తుతం రూ.2,200కు చేరింది. నెలరోజుల వ్యవధిలోనే బస్తాపై రూ.500 మేర ధర పెరిగింది. దీంతో సామాన్య ప్రజలు సన్న బియ్యం కొనుగోలుకే అధిక మొత్తాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.
హోటళ్లలో భోజనం ధరల పెంపు
నిత్యావసరాలు, కూరగాయల ధరల పెరుగుదలతో హోటళ్లలో భోజనం, అల్పాహార ధరలను పెంచారు. గతంలో నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో రూ.90 ఉండే ప్లేట్ భోజనం ప్రస్తుతం రూ.110కు పెంచారు. తోపుడు బండ్లపై రూ.5 ఉండే దోశను ప్రస్తుతం రూ.10 చేశారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చిన్న కుటుంబం జీవించడానికి నెలకు నిత్యావసర సరుకులకు రూ.5వేలు వరకు ఖర్చు చేసే వారు. ప్రస్తుత కూటమి పాలనలో పెరిగిన ధరలతో నెలకు రూ 8 వేలకుపైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితం 25 కేజీల బియ్యం బస్తా ధర రూ.1200 నుంచి రూ.1300 వరకు ఉండగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రూ.2,200కు విక్రయిస్తున్నారు. ఇలా కందిపప్పు, మినపప్పు, తదితర నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఉల్లిపాయలు సైతం కేజీ రూ.60 నుంచి రూ.70కు విక్రయిస్తున్నారు. కూరగాయల ధరలు అదే విధంగా మండిపోతున్నాయి. ఏ రకం పట్టుకున్న కేజీ రూ.50 నుంచి రూ.60 వరకు పలుకుతున్నాయి. బియ్యం, నిత్యావసర సరుకుల, కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు అల్లాడిపోతున్నాయి.
రైతుబజార్లలో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు నియంత్రించేలా చర్యలు చేపడుతున్నాం. రైతు బజార్లల్లో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశాం. నాణ్యమైన బియ్యం తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఇప్పటి వరకు 35 టన్నుల బియ్యం విక్రయించాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
–పుల్లయ్య, డీఎస్‌ఓ


