సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అధికార పార్టీకి అనుకూలం చేసేందుకు అన్ని వ్యవస్థలు దిగజారిపోయి ఊడిగం చేస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడమనేది రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికార యంత్రాంగం కాలరాస్తూ.. ఆ రాజ్యాంగమే తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ఆదేశాలే శాసనాల్లా.. ప్రజాస్వామ్యంపై జులుం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బరిలోకి దిగనీయకుండా సామదానభేద దండోపాయాలను అనుసరిస్తున్నారు. అధికార పార్టీ నేతల దాడులను, పోలీసుల బెదిరింపులను, దాష్టీకాలను దాటుకుని నామినేషన్లు వేస్తే.. ఆ నామినేషన్లను రాజ్యాంగ స్ఫూర్తికి, న్యాయవ్యవస్థల ఆదేశాలకు విరుద్ధంగా తిరస్కరిస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను తమ ఏకపక్ష నిర్ణయాలతో పోటీ నుంచి తప్పిస్తున్నారు. జిల్లాలో శనివారం జరిగిన నామినేషన్ల పరిశీలనలో కొందరు రిటర్నింగ్ అధికారులు అధికార పార్టీ కనుసన్నల్లో పని చేస్తూ సిల్లీ రీజన్స్‌తో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరణ చేయడంపై స్థానిక ఆర్డీఓకు అప్పీల్ చేసుకున్నా అక్కడ కూడా రాజకీయ ఒత్తిళ్లతో న్యాయం జరగలేదు.
హియరింగ్ వినకుండానే రిజెక్ట్
నెల్లూరు రూరల్ మండలం పెనుబర్తిలో ఎంపీటీసీగా పోటీ చేసిన వాల్మీకి శ్యామల నామినేషన్లలో ఎన్నికల వ్యయ ఖర్చుల డిక్లరేషన్‌పై సంతకం లేదని స్క్రూటీనిలో రిజక్ట్ చేశారు. వాస్తవంగా ఆ సంతకం రిటర్నింగ్ అధికారి సమక్షంలోనే తీసుకోవాలి. కానీ రిటర్నింగ్ అధికారి ఉద్దేశ పూర్వకంగా అభ్యర్థి వద్ద సంతకం తీసుకోకుండానే నామినేషన్ తీసుకొని స్క్రూటీనిలో రిజక్ట్ చేశారు. ఆపై ఆమె నెల్లూరు ఆర్డీఓ అనూష వద్దకు అప్పీల్ చేసుకుంది. సోమ వారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హియరింగ్‌కు హాజరుకావాలని ఆర్డీఓ అభ్యర్థికి నోటీసిచ్చారు. దీంతో శ్యామల సోమవారం నెల్లూరు ఆర్డీఓ కార్యాలయానికి న్యాయవాది ఉమామహేశ్వరరెడ్డితో కలిసి మధ్యాహ్నం 12.30 గంటలకు వెళ్లింది. అర్ధగంట పాటు వేచి ఉన్నా.. ఆర్డీఓ తన కార్యాలయానికి రాకుండానే అప్పీల్‌పై హియరింగ్ వినకుండానే స్థానిక పోలీసుల ద్వారా అప్పీల్‌ను రిజెక్ట్ చేసినట్లుగా ఆర్డర్ కాపీ పంపిణీ చేయడంపై అభ్యర్థి మండిపడ్డారు. రాపూరు మండలానికి చెందిన మరో ఏడు నామినేషన్లు, నెల్లూరు రూరల్ మరో నామినేషన్ అప్పిల్ చేసుకోగా వారికి అదే విధంగా హియరింగ్ వినకుండా ఆర్డర్ కాపీ ఇవ్వడంపై అభ్యర్థి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారులే టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు ఆర్డీఓ ఏకపక్ష నిర్ణయం
నామినేషన్ల తిరస్కరణపై
అప్పీల్ చేసుకున్న అభ్యర్థులు
ఆమె ఆఫీసుకు రాకుండానే హియరింగ్ వినకుండానే పోలీసుల ద్వారా ఆర్డర్
ఆర్డీఓ ఏకపక్ష నిర్ణయంపై హైకోర్టుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
నెల్లూరు ఆర్డీఓ అనూష ఏకపక్ష నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ లీగల్ టీం ఉమామహేశ్వరరావు, రోజారెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నికల నామినేషన్‌లో ఏదైనా చిన్నపాటి తప్పులున్నా, ఒక వేళ డిక్లరేషన్ ఇవ్వకున్నా చెక్ లిస్ట్‌లో అవి రాసి మరుసటి రోజు సప్లయ్ చేయమని రిటర్నింగ్ అధికారి చెప్పాలని కోర్టు తీర్పులో ఉందన్నారు. ఆ గైడ్ లైన్స్ పట్టించుకోకుండానే రిటర్నింగ్ అధికారులు రిజెక్ట్ చేయడం దారుణమన్నారు. ఆర్డీఓకు అప్పీల్ చేసుకుంటే ఆమె రాకుండానే ఆర్డర్ కాపీ ఎలా జారీ చేస్తారని న్యాయవాదులు ప్రశ్నించారు. ఆర్డీఓ కార్యాలయం సీసీ ఫుటేజీ పరిశీలిస్తే ఆమె కార్యాలయంలో ఉన్నది లేనిది తెలుస్తుందని, కార్యాలయంలోకి రాకుండానే హియరింగ్ వినుకుండా ఆర్డర్ ఇవ్వడంపై న్యాయస్థానంలో తేల్చుకుంటామన్నారు.


