తిరస్కరించి... ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

తిరస్కరించి... ఏకగ్రీవం

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

● కోట మండలం నందలికొక్కుపాడు ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరించారు. టీడీపీ ఏకగ్రీవమైంది. సంతకాలు సక్రమంగా లేవంటూ వైఎస్సార్సీపీ నామినేషన్‌ను తిరస్కరించారు. కడివేడు అభ్యర్థి షేక్‌ హుస్సేన్‌బాషా నామినేషన్‌ను తిరస్కరించారు. ● ఆత్మకూరు నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని మహిమలూరు అభ్యర్థి చామనబోయిన లక్ష్మీదేవి నామినేషన్‌తో నువ్వూరుపాడు స్థానాలకు సంబంధించి ఒక పేజీలో సంతకం చేయలేదని తిరస్కరించారు. ● చేజర్లలో ఎన్నికల అధికారే స్వయంగా నామినేషన్‌ పత్రాలను, డాక్యుమెంట్‌ పత్రాలను చించేసి మీరు జతపరచలేదని, నామినేషన్‌ రిజెక్ట్‌ చేశారని స్థానిక అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. చేజర్ల మండలం పుట్టుపల్లి సెగ్మెంట్‌కు నామినేషన్‌ వేసిన వైఎస్సార్సీపీ మహిళా అభ్యర్థి శ్యామల తన పిల్లలు పేర్లు రాయలేదని నామినేషన్‌ను తిరస్కరించారు. పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన లెటర్‌లో సంతకం లేదంటూ పాడేరు సెగ్మెంట్‌ అభ్యర్థిని మౌనిక నామినేషన్‌ తిరస్కరించారు. ఆమనిచిరువెళ్ల వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్లు పరిశీలించకుండా వెనక్కి పంపారు. చేజర్ల అభ్యర్థి వేలూరు రమణమ్మ పిల్లలు పేర్లు రాయలేదంటూ నామినేషన్‌ తిరస్కరించారు. ● మర్రిపాడులో ఎన్నికల అధికారులతోపాటు స్థానిక తహసీల్దార్‌ టీడీపీ నేతలకు ముందస్తుగా అవగాహనతోనే దాదాపు నాలుగు ఎంపీటీసీ స్థానాలు టీడీపీకి ఏకగ్రీవం చేశారనే ఆరోపణలున్నాయి. మరో రెండు సెగ్మెంట్లలో వైఎస్సార్‌సీపీ ప్రధాన అభ్యర్థులను తిరస్కరణ చేసి డమ్మీ అభ్యర్థులను ఓకే చేశారని ఆరోపిస్తున్నారు. ● సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం దొరువుపాళెంకు చెందిన దువ్వూరు కృష్ణతేజారెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలు సరిగా లేవని తిరస్కరించారు. ● కావలి నియోజకవర్గం అల్లూరు మండలం బీరంగుంట అభ్యర్థి నిమ్మకాయల సుభాషిణి నామినేషన్‌ పత్రంలో ఒక చోట సంతకం లేదని తిరస్కరించారు. కావలి మండలం రుద్రకోట సెగ్మెంట్‌కు పోటీ చేసిన జరుగుమల్లి భారతి నామినేషన్‌ను ఓటరు జాబితాలో ఒక రకంగా.. ఆధార్‌, కుల ధ్రువీకరణ పత్రంలో మరో రకంగా ఉన్నాయని తిరస్కరించారు. ● వెంకటాచలం మండలంలోని అనికేపల్లి బిట్‌ 2 స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరించారు.

ప్రజాక్షేత్రంలోకి ఓటుకెళ్తే గెలుస్తామనే ధీమా అధికార కూటమి పార్టీలకు లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎస్‌ఈసీ, సీఈసీలను అడ్డుపెట్టుకుని అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన టీడీపీని ప్రజలు తమ ఓటుతో తిరస్కరించారనే విషయం ఆ పార్టీ నేతలకు తెలుసు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే గతి పడుతుందని భావించే.. అడ్డదారులు తొక్కుతోంది. ప్రజాస్వామ్యం స్థానంలో పచ్చస్వామ్యం కొనసాగుతోంది. రాజ్యాంగం స్థానంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. పోలీసులను, అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని అధికార పార్టీ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల నుంచి ప్రారంభమైన దాడులు, నామినేషన్‌ పత్రాలు చించివేత, ఉపసంహరణ బెదిరింపులు వంటి దాష్టీకాలు పరిషత్‌ ఎన్నికల్లోనూ అప్రతిహతంగా కొనసాగుతున్నాయి.

సాక్షిప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో 440 ఎంపీటీసీ స్థానాలు, 35 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగేందుకు నామినేషన్లు స్వీకరించారు. 440 ఎంపీటీసీ స్థానాలకు 2,639 మంది నామినేషన్లు వేశారు. ఒకే పార్టీకి చెందిన వారు కూడా పలు సెట్లను దాఖలు చేయడంతో సంఖ్య భారీగా పెరిగింది. 35 జెడ్పీటీసీ స్థానాలకు 332 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్క్రూటీని శనివారం మధ్యాహ్నం 3 గంటలకే పూర్తయి పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా సాయంత్రం 7 గంటల వరకు కూడా కొన్నిచోట్ల పోటీలో నిలిచిన అభ్యర్థుల వివరాలు ప్రకటించలేదు.

ఏకపక్షంగా నామినేషన్ల తిరస్కరణ

స్థానిక సంస్థల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. జిల్లాలో చేజర్ల, మర్రిపాడు, వరికుంటపాడు, దుత్తలూరు ఆర్వోలు బరితెగించి అడ్డగోలుగా వ్యవహరించారు. కేవలం వైఎస్సార్‌సీపీ నామినేషన్ల విషయంలో కారణాలు లేకుండానే తిరస్కరించి.. టీడీపీ అభ్యర్థులను ఏకగ్రీవం చేసే విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. మరికొన్ని సెగ్మెంట్లలో టీడీపీ అభ్యర్థులతోపాటు అనామక అభ్యర్థి నామినేషన్లు ఆమోదించి పరోక్షంగా సహకారాన్ని అందించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలను స్థానిక అధికారులు టీడీపీ నాయకులకు ఆ పత్రాలను వాట్సాప్‌ ద్వారా పంపించినట్లు ఆరోపణలున్నాయి. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ నామినేషన్‌తో సబ్మిట్‌ చేసిన పలు పత్రాలను చించేయడం జరిగిందని, స్క్రూటీని చేసే సందర్భంగా వైఎస్సార్‌సీపీకి సంబంధించిన నామినేషన్‌ పత్రాల్లో సరైన పత్రం జతపరచలేదని, పలానా పేజీలో సంతకం చేయడం చెప్పడం చూస్తుంటే వారికి ముందుగానే నామినేషన్‌ పత్రాలు చేరినట్లుగా స్పస్టంగా అర్థమవుతుంది.నిబంధనలను అన్ని పార్టీలకు సమానంగా అమలు చేయాల్సిన అధికారులు అధికార పార్టీ నామినేషన్ల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల విషయంలో చిన్న, చిన్న కారణాలు చూపుతూ ఉద్దేశ పూర్వకంగా పలుచోట్ల తిరస్కరించారు. ఒక వైపు ఎన్నికల కమిషన్‌ చిన్న, చిన్న లోపాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంగా ప్రకటించినప్పటికీ అధికారులు మాత్రం ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తూ అధికార పార్టీ అభ్యర్థులకు అంటకాగారు.

వైఎస్సార్సీపీ అభ్యర్థులవే తిరస్కరణ

వైఎస్సార్సీపీ అభ్యర్థుల పత్రాల్లో సాంకేతిక కారణాలు చూపి తిరస్కరించి టీడీపీకి ఏకగ్రీవంగా చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. నామినేషన్‌ పత్రాల్లో సంతకాలు చేసినప్పటికీ అన్ని పత్రాల్లో సంతకాలు లేవంటూ తిరస్కరించారు. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని తోటలచెరువుపల్లి అభ్యర్థి రాయవరపు నారాయణ వృత్తి సక్రమంగా నమోదు చేయలేదని తిరస్కరించారు. ఇరువూరులో మారంరెడ్డి శివారెడ్డి నామినేషన్‌ను భార్యకు సంబంధించిన వివరాలు పూర్తిగా నమోదు చేయలేదంటూ తిరస్కరించారు. దుత్తలూరు మండలంలోని కొత్తపేట, బోడవారిపల్లె, నర్రవాడ సెగ్మెంట్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. దుత్తలూరు మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలుండగా రాత్రి సమయం వరకు కూడా 3 సెగ్మెంట్ల నామినేషన్‌ పత్రాల పరిశీలన చేయలేదు. ఈ మూడు సైతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులవే తిరస్కరించారు.

అంతా.. ఆనం కనుసన్నల్లోనే..!

కూటమి నేతలతో చేజర్ల ఆర్వో కుమ్మక్కు

ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. వైఎస్సార్సీపీ

అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ

చేజర్ల: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన మంత్రి ఆనం, కూటమి నేతల కనుసన్నల్లో జరిగింది. అమాత్యుడి ఆదేశాలతో చేజర్ల మండల ఆర్వో బొడ్డు ప్రసాద్‌బాబు ఏకపక్షంగా వ్యవహరించి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. కూటమి అభ్యర్థుల పత్రాలను నిమిషాల్లోనే పరిశీలించగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కరికీ గంటలు తీసుకున్నారు. నిబంధనలను పాటించకుండా మంత్రి కార్యాలయం సూచించిన సెగ్మెంట్లలో అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను ఆర్వో తిరస్కరించారని నేతలు ఆరోపించారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులు సంతకాలు చేసి వెళ్లిపోవాలంటూ ఆర్వో, సహాయ రిటర్నింగ్‌ అధికారి అమర్‌నాథ్‌ ఒత్తిడి తెచ్చారు.

సహనాన్ని పరీక్షించి..

పరిశీలన కార్యక్రమం సాయంత్రం ఐదు గంటలకల్లా పూర్తి కావాల్సి ఉండగా, రాత్రి పొద్దుపోయే వరకు జరిపి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల సహనాన్ని పరీక్షించారు. నాలుగు సెగ్మెంట్ల అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. ఆర్వో తీరును నిరసిస్తూ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆర్డీఓ, కలెక్టర్‌ను ఫోన్లో సంప్రదించేందుకు పార్టీ అభ్యర్థులు యత్నించగా, వారు స్పందించలేదు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే సంకేతాల తరుణంలో రాత్రికి రాత్రే అధికారులపై మంత్రి ఒత్తిడి తెచ్చి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించేలా ప్లాన్‌ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సీఎంఓ స్థాయిలో ఒత్తిడి

చేజర్ల మండలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులపై సీఎంఓ స్థాయిలో ఒత్తిడి తెచ్చి నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలంటూ హుకుం జారీ చేశారని తెలుస్తోంది. మండలంలోని ఓ సెగ్మెంట్‌కు పార్టీ తరఫున ఓసీ మహిళ పోటీ చేయగా, ఆమె భర్త చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై ఒత్తిడి తెచ్చి, నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలంటూ బెదిరింపులకు గురిచేశారని సమాచారం.

చేజర్ల, మర్రిపాడు, వరికుంటపాడు, దుత్తలూరు ఆర్వోల బరితెగింపు

ఓటమి భయంతో టీడీపీ అడ్డదారులు

నామినేషన్లు వేయనీయకుండా దాడులు, పత్రాల చించివేత

టీడీపీ నేతల అరాచకాలను ఎదిరించి.. దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

పరిశీలనలో కారణాలు లేకుండానే ఉద్దేశపూర్వకంగానే తిరస్కరణలు

అధికార పార్టీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన క్షణాల్లో ఆమోదం

వైఎస్సార్‌సీపీ నామినేషన్ల విషయంలో గంటల కొద్దీ భూతద్దాలతో శోధన

చిన్న, చిన్న విషయాలను

పట్టించుకోవద్దన్న ఎన్నికల కమిషన్‌

అయినా వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్‌

టీడీపీకి తొత్తుల్లా ఆర్వోల వ్యవహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement