నెల్లూరు(అర్బన్): తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆపై తుఫాన్‌గా మారనుందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. ఆర్నబ్ తుఫాన్ ప్రభావం జిల్లాపై తీవ్రంగా లేకపోయినా, భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కడలిలో అలలు ఇప్పటికే ఎగసిపడుతున్నాయి. సముద్రం ఐదు మీటర్ల మేర ముందుకొచ్చింది. తీరంలో ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. సముద్రంలోకి వేటకు మత్స్యకారులు వెళ్లరాదని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు.
మోస్తరు వానలు
జిల్లాలో వర్షాలు శనివారం దాదాపు ఆగిపోయాయి. కొన్ని మండలాల్లో ఓ మోస్తరుగా కురిశాయి. మర్రిపాడులో 34.8, వరికుంటపాడులో 29.6, నెల్లూరు అర్బన్‌లో 25.2, కోటలో 19.4, కోవూరులో 19.4, కావలిలో 17.6, తోటపల్లిగూడూరులో 17.2, దగదర్తిలో 15.4, ఉదయగిరిలో 13.8, బుచ్చిరెడ్డిపాళెంలో 12.8, కొడవలూరులో 12.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఓటర్ల సందేహాలకు
హెల్ప్‌లైన్
నెల్లూరు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నగరంలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నిరంతరం సేవలందిస్తోందని కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం కాల్ సెంటర్‌ను దాదాపు 50 మంది సంప్రదించారని వివరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నామని చెప్పారు. హెల్ప్‌లైన్ నంబర్ 0861 – 2331261, వాట్సాప్ నంబర్ 79955 76699ను సంప్రదించాలని సూచించారు.
బిల్లుల ప్రత్యేక వసూళ్ల
కార్యక్రమం నేడు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలో విద్యుత్ బిల్లుల ప్రత్యేక వసూళ్ల కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నామని ఎస్‌ఈ సుధాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్షేత్రస్థాయిలో బృందాలు పర్యటించి, పెండింగ్‌లో ఉన్న బిల్లులను వసూలు చేయనున్నాయని వివరించారు. లక్ష్యసాధనకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎన్‌ఎల్‌ఎస్‌ఏ
రాష్ట్రాధ్యక్షుడిగా మహేష్
ఉదయగిరి: నేషనల్ లా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎన్‌ఎల్‌ఎస్‌ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా హైకోర్టు న్యాయవాది, వింజమూరు మండలం బుక్కాపురానికి చెందిన కానాల మహేష్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను జాతీయ అధ్యక్షుడు సుందరరాజ్ శనివారం జారీ చేశారు. మహేష్‌కు అభినందనలను పలువురు తెలియజేశారు. న్యాయ విద్యార్థుల హక్కులు, సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
శ్రీవారి దర్శనానికి
15 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. ఏటీజీహెచ్ వరకు క్యూ చేరుకుంది. స్వామివారిని 70,496 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 29,327 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.95 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


