● అడ్డగోలుగా నామినేషన్ల తిరస్కరణ
నెల్లూరు(పొగతోట): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను శనివారం నిర్వహించారు. 35 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 302 దాఖలు కాగా, సీతారామపురం మండలానికి సంబంధించిన టీడీపీ డమ్మీ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించారు. మండలాల్లో పరిశీలన ప్రక్రియ రాత్రి వరకు సాగింది. అధికార పార్టీకి అనుకూలంగా ఆర్వోలు వ్యవహరిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేశారు. జిల్లా అధికారుల మాటలను లెక్క చేయకుండా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నామినేషన్లను పరిశీలించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాఖలు చేసిన వాటిని తిరస్కరించారు. నామినేషన్ వేసే అభ్యర్థికి ప్రపోజర్లుగా ఇద్దరు ఓటర్లు సంతకాలు చేయాల్సి ఉంది. అయితే నామినేషన్ల పరిశీలనకు వీరు రావాల్సిన అవసరం లేదని నిబంధనలు చెప్తున్నాయి. అయితే కొందరు ఆర్వోలు మాత్రం వీరు రావాల్సిందేనంటూ పట్టుబట్టారు.
● నగరంలోని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీటీసీల నామినేషన్లను సీఈఓ మధుసూదన్, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో పరిశీలించారు. ఒకటి కంటే అధికంగా దాఖలు చేసిన వారు అధికంగా ఉన్నారు. చివరికి 250 నామినేషన్లను ఓకే చేశారు. వైఎస్సార్ కాంగ్రెస పార్టీ – 86, టీడీపీ – 93, బీఎస్పీ – 18, బీజేపీ – 8, సీపీఎం – 2, కాంగ్రెస్ – 11, జనసేన – 16, స్వతంత్రులు – 16 మంది నామినేషన్లకు ఆమోద ముద్రేశారు.
నేటి నుంచి ఉపసంహరణ
జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను మంగళవారం మధ్యాహ్నం మూడు వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు స్వయంగా వచ్చి ఆర్వో కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.


