దుత్తలూరు(ఉదయగిరి): రపజాపోరులో ఓటమి తప్పదని భావించిన టీడీపీ నేతలు కుట్రలకు తెరలేపుతున్నారు. ఎలక్షన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బరిలో లేకుండా చేసే యత్నాలు జరుగుతున్నాయని పార్టీ మండల కన్వీనర్ వాసుదేవారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థుల నామినేషన్లలో తప్పుల్లేకపోయినా.. ఉన్నాయంటూ ఆర్వో రమణరావు గంటల పాటు కూర్చోబెట్టి తిరస్కరిస్తున్నారు. కొత్తపేట, నర్రవాడ, బోడవారిపల్లి ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన నామినేషన్ పత్రాలనే రాత్రి వరకు పరిశీలించారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల పత్రాలను తిరస్కరించి.. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించి ఏకగ్రీవమయ్యేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై తాము అప్పీల్‌కు వెళ్తామని, ఆర్వో బాధ్యతల నుంచి తప్పించి ఎన్నికలు సజావుగా సాగేలా కలెక్టర్ చర్యలు చేపట్టాలని కోరారు. నందిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముగ్గురి నామినేషన్ పత్రాలను తిరస్కరించారు.
ఆందోళన
ఆర్వో తీరును నిరసిస్తూ ఆందోళనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టారు. నేతలు మాలకొండారెడ్డి, మండవ శివ, గంగాధర్, అశోక్, తిరుపాల్‌నాయుడు, కాలేషా, నాగరత్తమ్మ, వెంకటేశ్వర్లురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


