● తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
తిరుపతి మంగళం: గూడూరు నియోజకవర్గం చిట్టమూరు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి అక్రమ అరెస్టును తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులుగుంపులుగా ఉన్న కూటమి కార్యకర్తలను నిలువరించలేని పోలీసులు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై కేసులు పెట్టి వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ అరెస్టుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్ష గొంతుకను అణచివేయాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో ఎన్నటికీ ఫలించవని, వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతుందని గురుమూర్తి స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా రాధా మాధవి
నెల్లూరురూరల్: ౖవెఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా నగర నియోజకవర్గానికి చెందిన డాక్టర్ వంగిమళ్ల రాధా మాధవిని నియమిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేశారు.
26, 28న ఎస్జీఎఫ్
క్రీడా ఎంపికలు
నెల్లూరు (టౌన్): స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈనెల 26, 28వ తేదీల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ మల్లికార్జున శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 26న అథ్లెటిక్స్ అండర్–19, హాకీ అండర్–19, కబడ్డీ, ఖోఖో, యోగాసనం అండర్–17, కరాటే, స్క్వాష్ అండర్–14, 17, 19 విభాగాల్లో బాల, బాలికలకు ఎంపికలు ఉంటాయన్నారు. 28న అథ్లెటిక్స్ అండర్–14, వాలీబాల్, ఫుట్‌బాల్ అండర్–19, ఖోఖో, యోగాసన అండర్–14, 19, హాకీ అండర్–14, 17, నెట్‌బాల్ అండర్–14, 17, 19 విభాగాల్లో ఎంపికలు ఉంటాయన్నారు. కాగా నెట్‌బాల్ ఎంపికలు బుచ్చిరెడ్డిపాళెంలోని డీఎల్‌ఎన్నార్ ప్రభుత్వ హైస్కూల్లో ఉంటాయన్నారు. క్రీడా ఎంపికలకు వ్యాయామ ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు.
ట్రాక్టర్ కిందపడి
డ్రైవర్‌కు తీవ్రగాయాలు
అల్లూరు: ట్రాక్టర్ టైర్ కిందపడి డ్రైవర్‌కు తీవ్రగాయాలపాలైన ఘటన అల్లూరు మండల పరిధిలోని బట్రకాగొల్లు పంట పొలాల్లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బట్రకాగొల్లుకు చెందిన ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతున్న తరుణంలో ఆ మట్టిని తరలించేందుకు పలు ట్రాక్టర్లు వచ్చాయి. ఈ క్రమంలో ఓ డ్రైవర్ ట్రాక్టర్‌ను నిలుపుకుని టైరు పక్కన నిలబడి ఉన్నారు. వెనుక నుంచి మరో ట్రాక్టర్ వస్తూ ప్రమాదవశాత్తు ఢీకొనడంతో ముందున్న ట్రాక్టర్ కదిలి టైరు పక్కన నిలబడి ఉన్న డ్రైవర్‌ను తొక్కుకునిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారని సమాచారం. డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అల్లూరు పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు.
చెక్‌పోస్ట్‌లలో
వాహన తనిఖీలు
నెల్లూరు(క్రైమ్): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. నెల్లూరు నగర ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లోని నవబాలదుర్గా దేవి గుడి వద్ద, పాతచెక్ పోస్టు, అయ్యప్పగుడి, కొత్తూరు, చింతారెడ్డిపాళెం జంక్షన్, అపోలో కూడలి వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఎంసీసీ అండ్ ఎస్‌ఎస్‌టీ బృందాలు నిరంతరం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా నగదు, మద్యం, ఇతర ప్రలోభ వస్తువులు అక్రమంగా తరలించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.


