నేనున్నాను.. ఆక్రమించుకో.. | - | Sakshi
Sakshi News home page

నేనున్నాను.. ఆక్రమించుకో..

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

● టీడీపీ నేత సహకారంతో వ్యాపారవేత్త దురాక్రమణ పర్వం

● పెన్నాలో వంద అంకణాల పూడ్చివేత

నెల్లూరు సిటీ: నగరంలోని భువనేశ్వరి అమ్మవారి ఆలయానికి సమీపంలో గోదాముల వద్ద పెన్నానది ఆక్రమణపై సాక్షిలో ‘దర్జాగా పెన్నానది ఆక్రమణ’ పేరిట గత నెల 23వ తేదీన కథనం ప్రచురితమైంది. దీంతో ఆయన కొంత కాలం ఆక్రమణకు బ్రేక్‌ ఇచ్చాడు. అయితే మూడు రోజుల నుంచి మళ్లీ ఆక్రమణను ప్రారంభించారు. ఇప్పటికే ట్రాక్టర్‌లలో వందల ట్రిప్‌ల మట్టిని తీసుకొచ్చి పూడ్చి వేస్తున్నారు. వంద అంకణాలకు పైగా స్థలాన్ని ఆక్రమించాడని తెలుస్తోంది. లోపలికి వెళ్లేందుకు కూడా ప్రత్యేక గేటును ఏర్పాటు చేశాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యాపారవేత్త ఏర్పాటు చేసిన గేటుకు అటువైపు ఎవరి కంటపడకుండా పెన్నానదిని కొంచెంకొంచెంగా ఆక్రమిస్తున్నారు.

ఎవరూ వెళ్లనీయకుండా..

స్థానికంగా ఉండే ఓ టీడీపీ నేత వ్యాపారవేత్తకు పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చాడని సమాచారం. పత్రికల్లో, మీడియాలో వార్తలొచ్చినా ఎవరూ ఏమీ చేయలేరని, తాను మంత్రి నారాయణకు దగ్గరగానే ఉంటానని, అన్నీ తాను చూసుకుంటానని చెప్పుకొచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల సమయం కావడంతో ఆ నేతకు భారీగా డబ్బులు ఇవ్వడంతో అధికారులను సైతం అటు వైపు వెళ్లనీయకుండా అండగా ఉన్నారు. అయితే ఈ ప్రాంతంలోనే మంత్రి నారాయణ పర్యటనలు చేస్తున్నా ఆక్రమణలపై పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నగరంలోని కిసాన్‌నగర్‌లో ఓ వ్యాపారవేత్త దాదాపు వంద అంకణాలకు పైగా పెన్నానదిని పూడ్చి ఆక్రమిస్తున్నారు. ఓ టీడీపీ నేత తాను నారాయణ దగ్గరే ఉంటానని, నీకు అడ్డుతగిలే వారు లేరని భరోసా ఇవ్వడంతో ఏకంగా గేట్లు ఏర్పాటు చేసి ఎవరూ రాకుండా ఆక్రమణ పర్వం సాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement