నెల్లూరు(అర్బన్): కలెక్టర్ ఆదేశించినా కనికరం చూపకుండా జియావుల్ హక్ అనే వ్యక్తికి కారుణ్య నియామకం ఇవ్వలేదని ఆవాజ్ అసోసియేషన్ నాయకులు శనివారం దర్గామిట్టలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆవాజ్ జిల్లా కార్యదర్శి రషీద్ మాట్లాడుతూ ఆర్‌అండ్‌బీ శాఖలో ఓ సీనియర్ అసిస్టెంట్ 24 ఏళ్లుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తూ ఆశాఖను శాసిస్తోందన్నారు. ఆమె చెప్పినట్లు ఎస్‌ఈ కూడా వినడం దారుణమన్నారు. కారుణ్య నియామకం కింద ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని ఎస్‌ఈని ప్రశ్నిస్తే సీనియర్ అసిస్టెంట్ సుధామాలిని సంతకం పెట్టడం లేదని చెప్పడం సిగ్గు చేటన్నారు. సీనియర్ అసిస్టెంట్‌కు ఎస్‌ఈ భయపడటం దారుణమన్నారు. ప్రభుత్వం స్పందించి విచారణ జరపాలని కోరారు. కార్యక్రమంలో బాధితుడు జియావుల్ హక్‌తో పాటు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇంట్లో వైర్లు బిగిస్తుండగా..
● విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
సంగం: ఇంట్లో విద్యుత్ వైర్లు బిగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కల్లుగీత కార్మికుడు మృతిచెందిన ఘటన మండలంలోని మర్రిపాడు గ్రామంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కల్లుగీత పనులు చేసుకుంటూ జీవిస్తున్న పి.మహేంద్ర (40)కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఈ క్రమంలో ఇంట్లో విద్యుత్ వైర్లు బిగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడిన మహేంద్రను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతిచెందారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మహేంద్ర మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో మర్రిపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఎస్సై భోజ్యానాయక్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


