కోవూరుపల్లిలో శాంతిభద్రతలు నివురుగప్పిన నిప్పు | - | Sakshi
Sakshi News home page

కోవూరుపల్లిలో శాంతిభద్రతలు నివురుగప్పిన నిప్పు

Nov 20 2026 2:12 AM | Updated on Nov 20 2026 2:12 AM

కావలి: బోగోలు మండలం కోవూరుపల్లిలో వైఎస్సార్‌సీపీ నేత ఆత్మహత్యాయత్నం ఘటనతో శాంతిభద్రతలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఈ పరిస్థితికి పోలీసుల అత్యుత్సాహమే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల వేధింపుల వల్లే వైఎస్సార్‌సీపీ నేత మన్నేపల్లి శ్రీనివాసులు బుధవారం రాత్రి పురుగు మందు తాగి అఘాయిత్యానికి పాల్పడినట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తొలుత కావలికి తరలించడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల సూచనలతో నెల్లూరు నారాయణ వైద్యశాలకు తరలించారు. అయితే రెండు.. మూడు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని చెప్పిన డాక్టర్లు.. గురువారం సాయంత్రం అత్యవసరంగా అంతా బాగుందని ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాసులును డిశ్చార్జి చేశారు. అతని ఆరోగ్యం బాగుంటే.. జనరల్‌ వార్డుకు మార్చి.. అబ్జర్వేషన్‌ అనంతరమే డిశ్చార్జి చేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా అత్యవసరంగా డిశ్చార్జి చేయడంతో అతని పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చైన్నెకు తరలించినట్లు తెలుస్తోంది.

బయటకు రాకుండా జైల్లోనే మగ్గబెడతాం

శ్రీనివాసులును గంజాయి కేసులతోపాటు పాత కేసుల్లో బయటకు రాకుండా మగ్గబెట్టుతామని సీఐ, ఎస్సైలు బెదిరించినట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వారి సమాచారం మేరకు.. వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్‌ అభ్యర్థిగా బొచ్చు దుర్గమ్మ నామినేషన్‌ దాఖలు చేయగా, ఈ పంచాయతీని ఏకగ్రీవంగా టీడీపీ ఖాతాలో వేసేందుకు ఆమె భర్త మన్నేపల్లి శ్రీనివాసులును సీఐ, ఎస్సైలు తీవ్ర స్థాయిలో బెదిరించారు. నామినేషన్‌ దాఖలు చేసిన రోజే భార్యాభర్తలను స్టేషన్‌కు పిలిపించి.. సెల్‌ ఫోన్లు కూడా లోపలికి తీసుకెళ్లనీయకుండా బయటే లాగేసుకుని నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకుంటే నీకే మంచిదని హెచ్చరించారు. నీపై ఇప్పటికే 13 కేసులు ఉన్నాయి.. గంజాయి కేసులతోపాటు పాత కేసుల్లో రౌడీషీట్‌తో పీడీ యాక్ట్‌ పెడతామని, జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ‘మీ ఎంపీటీసీ ఎన్నికల్లో మీరు ఎలా ఓడిపోయారో తెలుసా.. బ్యాలెట్‌ బాక్సులే మార్చేసి ఓడించాం. కాదు కూడదని ఎన్నికల్లో పోటీ చేస్తే.. ప్రచారం కూడా చేయనీయకుండా కేసులు పెట్టి లోపలేసి.. పోలింగ్‌ బూత్‌ల్లో మీ ఏజెంట్లనే లేకుండా చేసి.. రిగ్గింగ్‌ చేయించి 200 ఓట్లతో టీడీపీ వాళ్లను గెలిపిస్తాం. మేము బెదిరించామని మీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డికి చెప్పుకుంటావో.. మీ జగన్‌కు చెప్పుకో.. చెప్పింది చేయకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అంటూ తీవ్రమైన స్వరంతో హెచ్చరించారని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

2013 నాటి ఘటన పునరావృతమయ్యే పరిస్థితులు

2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే అనుమానాలతో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడి ఇరు వర్గాలు కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. అయితే ఈ ఘటనకు ముందు.. తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఇటువంటి ఘటనలు జరిగిన దాఖలాల్లేవు. ఈ నెలలో పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అయితే తాజాగా జరుగుతున్న సర్పంచ్‌ ఎన్నికల్లో పోలీసులు జోక్యం చేసుకోవడం, సర్పంచ్‌ అభ్యర్థి దంపతులను బెదిరించడం, ఆమె భర్త ఆత్మహత్యాయత్నం చేయడం వంటి పరిణామాలతో గ్రామంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. సర్పంచ్‌ అభ్యర్థి పరిస్థితి విషమంగా ఉండడంతో చైన్నెకు తరలించిన నేపథ్యంలో.. మరో వారం రోజుల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోలీసుల జోక్యం.. వారు హెచ్చరించినట్లు రిగ్గింగ్‌ వంటి పరిణామాలు, ఓట్ల లెక్కింపులో తేడాలు వచ్చినా గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో పోలీసుల అత్యుత్సాహం కక్షలు కార్పణ్యాలకు దారి తీసే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికలను సజావుగా నిర్వహించకపోతే.. జరగబోయే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని సర్వత్రా అభిప్రాయం.

పోలీసుల వేధింపులతో సర్పంచ్‌ అభ్యర్థి భర్త మన్నేపల్లి ఆత్మహత్యాయత్నం

అతని పరిస్థితి విషమంగా ఉండడంతో చైన్నెకు తరలింపు

వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్‌ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని పోలీసుల వార్నింగ్‌

ఎంపీటీసీ ఎన్నికల్లో బ్యాలెట్‌ బాక్సులే మార్చేశాం.. సర్పంచ్‌ ఎన్నికల్లో ఏజెంట్లే లేకుండా చేసి రిగ్గింగ్‌ చేయిస్తామంటూ బెదిరించారని బాధితుల ఆరోపణలు

ఎన్నికల్లో ఏ తేడా జరిగినా..

తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితులు అనివార్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement