రైతు ద్రోహి చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

రైతు ద్రోహి చంద్రబాబు

Nov 20 2026 2:12 AM | Updated on Nov 20 2026 2:12 AM

నెల్లూరు రూరల్‌: రైతులతో చర్చించకుండా.. ఐఏబీ సమావేశంలో ఏకపక్ష నిర్ణయాలను తీసుకొని సాగునీటిని అందించలేమని ప్రకటించడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. కలెక్టర్‌ వెంటనే స్పందించి నిర్ణయాలను పునఃసమీ క్షించాలని.. గ్రామసభలను నిర్వహించి అన్నదాతల అభిప్రాయాలను సేకరించాలని డిమాండ్‌ చేశారు. గోప్యతను పాటించడం, మీడియాకు ప్రవేశం కల్పించకపోవడం, రైతు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించకుండా కొద్ది మందితో సమావేశాన్ని నిర్వహించడమేమిటని ప్రశ్నించారు.

ప్రణాళికలను రూపొందించడంలో వైఫల్యం

సోమశిలలో 19.7.. కండలేరు జలాశయంలో 16 టీఎంసీలు అందుబాటులో ఉన్నా, సాగునీటిని ఇవ్వలేమని చెప్పడం అన్యాయమన్నారు. ఎల్‌నినో తీవ్రతపై ముందే తెలిసినా ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించలేదని ధ్వజమెత్తారు. నెల్లూరు డెల్టాతో పాటు కండలేరు పరీవాహక ప్రాంతంలోని మనుబోలు తదితర మండలాల రైతులకు సాగునీటి హక్కులున్నాయని చెప్పారు. ధాన్యానికి మంచి ధరలు లభిస్తున్న నేపథ్యంలో తొలి పంటకు నీటిని అందిస్తే రైతులు అధిక దిగుబడులు సాధించే అవకాశముందని పేర్కొన్నారు. 1.8 లక్షలెకరాల్లో రెండో పంట సాగుకు 74 టీఎంసీలను వినియోగించి జలాశయాలను ఖాళీ చేశారని.. వాస్తవానికి 18 టీఎంసీలతోనే ఆ పంట సాగు సాధ్యమైతే, అదనంగా 56 టీఎంసీలను ఎందుకు వినియోగించారని ప్రశ్నించారు.

తమ హయాంలో సజావుగా..

2022 – 23లో తమ ప్రభుత్వ హయాంలో జలాశయాల్లో సుమారు 30 టీఎంసీలున్నా, క్రాప్‌ హాలిడేను ప్రకటించకుండా నీటిని అందించామని, అవసరమైతే శ్రీశైలం నుంచి తరలించి పంటలను కాపాడిన అంశాన్ని గుర్తుచేశారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గకముందే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కనీసం పది టీఎంసీలను తరలించి ఉంటే నెల్లూరు రైతులకు ఈ పరిస్థితి ఏర్పడేది కాదని వివరించారు. చుక్క నీటిని విడుదల చేయనని చంద్రబాబు చెప్పినప్పుడే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

హామీ ఇచ్చినా.. అతీగతీ లేదు

బోర్ల కింద సాగు చేయొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారని.. యూరియాను విక్రయించొద్దంటూ డీలర్లకు ఆదేశాలిచ్చారనే విషయం తన దృష్టికొచ్చిందని చెప్పారు. సీమ ఎత్తిపోతల పథకం పూర్తయి ఉంటే నిత్యం మూడు టీఎంసీలను తరలించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. సోమశిల జలాశయ భద్రత పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రాజెక్టు వద్దకు గతంలో వచ్చి సీజన్‌ ముగిసేలోపు వర్కులను పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అయితే ఐదు సీజన్లు గడిచినా, అతీగతీ లేదని విమర్శించారు. సోమశిల ఆప్రాన్‌ ప్రాంతం గతంలో దెబ్బతిన్న సమయంలో నిధులను అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసి పనులను ప్రారంభించారని, అయితే ప్రభుత్వం మారాక ఇవి నిలిచిపోయాయని విమర్శించారు. కాలువల శుభ్రత, సిల్ట్‌, చెట్ల తొలగింపు పనుల్లో భారీగా అవినీతి జరుగుతోందని.. ఒకే పనిని ఉపాధి హామీ, ఎఫ్డీఆర్‌, ఓ అండ్‌ ఎం కింద చూపి పలుమార్లు బిల్లులు చేసుకుంటున్నారని ఆరోపించారు.

అప్పుల ఊబిలోకి నెట్టారు..

రైతు భరోసాను నిలిపేసి, ఉచిత పంట బీమాను ఎత్తేసి, ఇన్‌పుట్‌ సబ్సిడీని సకాలంలో చెల్లించకుండా రైతులను అప్పుల ఊబిలోకి సర్కార్‌ నెట్టిందని ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించడం సరికాదన్నారు. సోమశిల, నెల్లూరు బ్యారేజీ, కండలేరు జలాశయాలను పరిశీలించేందుకు గతంలో తాము వెళ్లగా, అరెస్ట్‌ చేశారని.. రైతులతో కలిసి మరోసారి సందర్శించి వాస్తవాలను పరిశీలించనున్నామని పేర్కొన్నారు. అన్నదాతలకు న్యాయం చేయకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేయనున్నామని ప్రకటించారు.

సాగునీటి నిర్ణయాలను

పునఃసమీక్షించాలి

జలాశయాల్లో నీరున్నా.. ఇవ్వకపోవడం అన్యాయం

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement