అనుమతులా.. మాకెందుకు? | - | Sakshi
Sakshi News home page

అనుమతులా.. మాకెందుకు?

Nov 20 2026 2:12 AM | Updated on Nov 20 2026 2:12 AM

●

నెల్లూరు(టౌన్‌): గత విద్యా సంవత్సరంలో 40 రోజుల వ్యవధిలోనే కార్పొరేట్‌, ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి, అరకొర వసతుల కారణంగా ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయినప్పటికీ ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు, ఇతర జిల్లా అధికారుల్లో ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ అనుమతులు లేకుండానే హాస్టళ్లు నిర్వహిస్తున్నా తమకు సంబంధం లేదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు.

30కి పైగా హాస్టళ్లు

జిల్లావ్యాప్తంగా మొత్తం 137 కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలున్నాయి. వీటిలో ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య, విశ్వసాయి జూనియర్‌ కళాశాలలకు చెందిన హాస్టళ్లు అధికంగా ఉన్నాయి. ఇంకా ఓవెల్‌, ఎస్‌ఆర్‌, రత్నం తదితర కళాశాలలకు అనుబంధంగా కూడా హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఈ తరహాలో 30కి పైగా అనధికారికంగా కొనసాగుతున్నట్లు సమాచారం. వీటిలో 15 వేల మందికి పైగా విద్యార్థులు ఉంటున్నట్లు అంచనా. ఇంటర్మీడియట్‌ విద్య, హాస్టల్‌ వసతులకు కలిపి కళాశాలను బట్టి రూ.80 వేల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. వీటికి అదనంగా పరీక్ష ఫీజు, హాస్టల్‌ డిపాజిట్‌, ప్రాక్టికల్స్‌, గేమ్స్‌ తదితర పేర్లతో మరో రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు తీసుకుంటున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న హాస్టళ్లలో రాష్ట్ర మంత్రి నారాయణకు చెందినవిగా పేర్కొంటున్నవి 10కి పైగా ఉండటం గమనార్హం.

అనుమతులు లేకుండానే..

జూనియర్‌ కళాశాలల పేరిట నిర్వహిస్తున్న హాస్టళ్లకు ప్రభుత్వ అనుమతి లేదు. కొన్ని యాజమాన్యాలు ఒకే భవనంలో కళాశాల, హాస్టల్‌ నిర్వహిస్తుండగా, మరికొన్ని కళాశాలలను ఒకచోట, హాస్టళ్లను మరోచోట ఏర్పాటు చేశాయి. ఏ ఒక్క దానికీ ఫైర్‌ సర్టిఫికెట్‌ లేదు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. హాస్టళ్లలో వసతులు అధ్వానంగా ఉంటున్నాయని, కారాగారాలను తలపించే భవనాల్లోని ఇరుకు గదుల్లో విద్యార్థులను ఉంచుతున్నారని విమర్శలున్నాయి. ఒక్కో గదిలో ఐదు నుంచి ఏడుగురు విద్యార్థులను కుక్కుతున్నారు. రూ.లక్షలు వసూలు చేస్తున్నా నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. ర్యాంకుల సాధన పేరుతో ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు తరగతులు, స్టడీ అవర్స్‌ నిర్వహిస్తూ విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు. భోజనం బాగోలేదని, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, ఇరుకు గదుల్లో నిద్రపోలేకపోతున్నామని పిల్లలు ఇంట్లో చెప్పినా ఏదో విధంగా సర్దుకుపోవాలని తల్లిదండ్రులు సూచిస్తున్న పరిస్థితి ఉంది.

స్పందన ఏదీ?

అనుమతి లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తున్నా జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారుల్లో చలనం లేదు. విద్యార్థులు ఫిర్యాదులు చేసినా తనిఖీలు చేపట్టిన సందర్భాల్లేవు. కార్పొరేట్‌ యాజమాన్యాల నుంచి అధికారులకు రూ.లక్షల్లో మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతోనే కళాశాలలు, హాస్టళ్లవైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదని ప్రచారం జరుగుతోంది. ఫైర్‌ సర్టిఫికెట్‌ లేకున్నా అగ్నిమాపక శాఖాధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం దారుణం. కళాశాలల యాజమాన్యాల తీరుపై ఇంటర్‌ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌ స్పందించి అనుమతుల్లేని హాస్టళ్లు, కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై వివరణ కోరేందుకు ఆర్‌ఐఓ వరప్రసాదరావుకు పలుమార్లు ఫోన్‌ చేసినా ఆయన అందుబాటులోకి రాలేదు.

జిల్లాలో 30కి పైగా జూనియర్‌

కళాశాలల అనుబంధ హాస్టళ్లు

ఒక్కదానికీ అనుమతి లేదు

విద్యార్థుల నుంచి

రూ.లక్షల్లో ఫీజుల వసూలు

వసతులు, నాణ్యమైన

భోజనానికి తిలోదకాలు

హాస్టళ్లతో తమకు సంబంధం

లేదంటున్న ఇంటర్‌ అధికారులు

మామూళ్లతో మిన్నకుంటున్న వైనం

కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా హాస్టళ్లను ఏర్పాటు చేసి విద్యార్థుల నుంచి ఏటా రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. అయినా కనీస వసతులు కల్పించడం లేదు. మరోవైపు ర్యాంకుల పేరుతో విద్యార్థులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్న యాజమాన్యాలు వారి ఆరోగ్యం, సంక్షేమంపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement