ఆర్సీ, లైసెన్స్‌ కార్డులకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

ఆర్సీ, లైసెన్స్‌ కార్డులకు మోక్షం

Nov 20 2026 2:12 AM | Updated on Nov 20 2026 2:12 AM

నెల్లూరు(టౌన్‌): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిలిచిపోయిన డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ (ఆర్సీ) కార్డుల ముద్రణకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. కార్డుల కోసం వాహనదారుల నుంచి నగదు వసూలు చేస్తున్నప్పటికీ ముద్రణ జరగకపోవడంతో వాటి జారీ నిలిచిపోయింది. తాజాగా రోస్‌మోర్టా సంస్థ టెండర్‌ దక్కించుకోవడంతో కార్డుల ముద్రణ ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో భౌతిక కార్డుల స్థానంలో డిజిటల్‌ విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో కార్డుల కోసం నగదు వసూలు చేయడం నిలిపివేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ కార్డుల కోసం రూ.200, పోస్టల్‌ ఛార్జీల కింద రూ.35 కలిపి మొత్తం రూ.235 వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ కార్డుల ముద్రణ జరగకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా టెండర్‌ దక్కించుకున్న సంస్థ కార్డుల ముద్రణ చేపట్టినట్లు తెలుస్తోంది. ముద్రణ పూర్తయిన అనంతరం వాహనదారులు దరఖాస్తు సమయంలో ఇచ్చిన చిరునామాలకు పోస్టు ద్వారా నేరుగా పంపించనున్నట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

డాక్టర్‌ లావణ్యకు

ఘన నివాళి

నెల్లూరు(వేదాయపాళెం): ఎనెల్‌ హాస్పిటల్స్‌ డైరెక్టర్‌, ప్రముఖ న్యూరాలజిస్ట్‌ కుంకాల లావణ్య ఉత్తరక్రియలు గురువారం ఇస్కాన్‌ సిటీలోని ఎస్సార్‌ ఎప్సిలాన్‌ అపార్ట్‌మెంట్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. ఆమె సేవలను కొనియాడారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రైల్వే ఫ్లై ఓవర్‌ కింద

మృతదేహం

నెల్లూరు సిటీ: నెల్లూరు నగరంలోని పెన్నానది రైల్వే ఫ్లై ఓవర్‌ కింద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. సుమారు 45 సంవత్సరాల వయసున్న వ్యక్తి చనిపోయి ఉండగా స్థానికులు గుర్తించారు. నవాబుపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. రోజ్‌ కలర్‌ షర్ట్‌, పసుపు రంగు ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. మృతదేహం ఉబ్బిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94407 96310, 94407 96306 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి కోరారు.

స్టార్టర్లు, పైపులు,

మోటార్లకు నిప్పు

వరికుంటపాడు: మండలంలోని విరువూరు పంచాయతీ కృష్ణంరాజుపల్లిలోని పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ సాగు పరికరాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల కార్యవర్గ సభ్యుడు ఉలిసే నారాయణరాజుకు విరువూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 156లో 1.80 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో నిమ్మ, బత్తాయి, వరి, కంది పంటలను సాగు చేస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పొలంలోకి ప్రవేశించి స్టార్టర్‌, పైపులు, డ్రమ్ములు, కంచె, మోటార్‌ తదితర పరికరాలను ధ్వంసం చేశారు. అలాగే పైపులు, స్టార్టర్‌ను కాల్చివేశారు. నారాయణరాజు వరికుంటపాడు పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. విచారణ చేపడతామని ఎస్సై కె.మధుసూదన్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement