● సమస్యతో పిల్లల ఎదుగుదలకు ఆటంకం
● రక్తహీనత, పౌష్టికాహార లోపానికి కారణం
● 5.94 లక్షల డోసులను
సిద్ధం చేసిన వైద్యశాఖ అధికారులు
● విద్యార్థులకు ఆల్బెండాజోల్
మాత్రల పంపిణీ
● డీ వార్మింగ్ డే నేడు
● బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకూడదు. పరిశుభ్రమైన టాయ్‌లెట్స్‌ను వినియోగించాలి.
● ఆహారం తినే ప్రతిసారి చేతులను సబ్బుతో కడగాలి
● బయటకొచ్చినప్పుడు, టాయ్‌లెట్లను వినియోగించేటప్పుడు పాదరక్షలను తప్పక ధరించాలి
● స్వచ్ఛమైన తాగునీటిని వినియోగించాలి. మూతేసి ఉంచిన ఆహార పదార్థాలనే తీసుకోవాలి
● పండ్లు, కూరగాయలను తినేటప్పుడు శుభ్రంగా కడగాలి ● వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి.
నెల్లూరు(అర్బన్): పిల్లల ఆరోగ్యాన్ని లోలోపల నులిపురుగులు దెబ్బతీస్తాయి. పేగుల్లో చేరిన ఇవి మనం తినే ఆహారాన్ని, పోషకాలను తినేస్తాయి. ఫలితంగా పిల్లల్లో రక్తహీనత, ఆకలి తగ్గడం, బరువు పెరగకపోవడం, ఎదుగుదల మందగించడం తదితర సమస్యలొస్తాయి. దీంతో విద్యార్థులు తమ చదువుపై ధ్యాసను కోల్పోతారు. ఇతరులకంటే వెనుకబడిపోతారు. నీరసంగా ఉంటూ ఏ పనిలో ముందుకు సాగలేరు. ఈ విషయాన్ని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్నెల్లకోసారి జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. విద్యార్థులతో ఆల్బెండాజోల్ మాత్రలను మింగించేలా చర్యలు చేపడుతోంది. ఒక్క మాత్రతో నులిపురుగులను నివారించొచ్చు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను వైద్యశాఖ అధికారులు చేపట్టారు. కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున శుక్రవారం చేపట్టనున్నారు. 5,94,213 మాత్రలను సిద్ధం చేశారు.
నోటి ద్వారా పొట్టలోకి..
పరిశుభ్రత లోపించడం, చేతులు కడుక్కోకుండా ఆహారం తీసుకోవడం, కలుషితమైన నీటిని తాగడం, శుభ్రంగా కడగని కూరగాయలు, పండ్లు తినడం తదితరాలతో కొన్ని రకాల నులిపురుగుల గుడ్లు నోట్లో నుంచి పొట్టలోకి చేరుతాయి. ఇవి పేగుల్లో పిల్లలుగా మారుతాయి. ఎక్కువగా మట్టిలో ఆడుకుంటూ సక్రమంగా శుభ్రం చేసుకోని చేతుల ద్వారా నులిపురుగుల గుడ్లు శరీరంలోకి చేరిపోతున్నాయి.
ఒక్క మాత్రతో నివారణ
ఒక్క ఆల్బెండాజోల్ మాత్రను చప్పరించడం లేదా నమిలి మింగడం ద్వారా కొంకి పురుగులు, బద్దెపురుగులు లాంటి నులిపురుగులను నివారించొచ్చు. ఒకటి నుంచి రెండేళ్లలోపు పిల్లలకు పొడిచేసిన మాత్రను నీటిలో కలిపి ఇవ్వనున్నారు. మూడు నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు పూర్తి మాత్రను మింగించనున్నారు.
లక్షణాలిలా..
నులిపురుగులు కడుపులో ఉంటే పొట్ట నొప్పి, కడుపుబ్బరం వస్తుంది. ఆకలి తగ్గిపోతుంది. బరువు పెరగకపోగా, తగ్గిపోతారు. రక్తహీనత, బలహీనత, నీరసం, ఆహారం జీర్ణమవడంలో ఇబ్బందులు, విరేచనాలు, చిరాకు, నిద్రలో అసౌకర్యం కలుగుతాయి.
నివారణకేమి చేయాలి..?


