జెడ్పీలో పారదర్శకంగా పాలన | - | Sakshi
Sakshi News home page

జెడ్పీలో పారదర్శకంగా పాలన

Sep 25 2026 12:47 AM | Updated on Sep 25 2026 12:47 AM

● అందరి సహాయ, సహకారాలతో ఐదేళ్లు పూర్తి

● ప్రజలకు అందుబాటులో ఉంటా

● మాజీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ

నెల్లూరు(పొగతోట): జెడ్పీ యాజమాన్య పరిధిలో పారదర్శక పాలనను ఐదేళ్లు అందించామని తాజా మాజీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. కార్యాలయంలోని ఆమె చాంబర్‌లో జెడ్పీటీసీలు, అఽధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నేతలు గురువారం కలిసి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పాలనను విజయవంతంగా అందించామని వివరించారు. సభ్యుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. అందుబాటులో ఉన్న నిధులతో అన్ని ప్రాంతాలకు పనులను మంజూరు చేసి సకాలంలో పూర్తి చేశామని వెల్లడించారు. తనకు ఈ అవకాశాన్ని గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారని కొనియాడారు. ఆయన చెప్పిన విధంగా ముందుకు సాగుతామని వెల్లడించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రకటించారు. గడిచిన ఐదేళ్లలో జెడ్పీ సాధారణ నిధులు రూ.37.82 కోట్లతో 955.. ఆర్థిక సంఘ నిధులు రూ.59.16 కోట్లతో 1255.. రూ.62 కోట్లతో 237 పనులను పూర్తి చేశామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు, అంగన్‌వాడీ కేంద్ర భవనాల మరమ్మతులు, డ్రైనేజీలకు నిధులను అత్యంత ప్రాధాన్య క్రమంలో మంజూరు చేశామని తెలిపారు. జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం విజయదీపిక స్టడీ మెటీరియళ్లను అందజేశామని వివరించారు. 258 మందికి ఉద్యోగోన్నతులు.. జెడ్పీ యాజమాన్య పరిధిలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యులు 123 మందికి కారుణ్య నియామకాలను కల్పించామన్నారు. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతానికిపైగా అవకాశం కల్పించిన జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలను తెలియజేశారు.

ముగిసిన పదవీ కాలం

జెడ్పీటీసీల పదవీ కాలం గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 46 మండలాల్లో జెడ్పీటీసీలందరూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే. నూతన జెడ్పీ మేరకు 35 మండలాలు ఏర్పడ్డాయి. కాగా జెడ్పీ ఎన్నికల నిర్వహణకు మండలాల వారీగా ప్రత్యేకాధికారులను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement