రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

Sep 25 2026 12:47 AM | Updated on Sep 25 2026 12:47 AM

వెంకటాచలం: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెంకటాచలం రైల్వేస్టేషన్‌ సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. సుమారు 35 ఏళ్ల వయస్సు గల వ్యక్తి వెంకటాచలం రైల్వేస్టేషన్‌ సమీపంలో డౌన్‌ లైన్లో వెళ్తున్న రైలు కిందపడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. విషయాన్ని రైల్వే సిబ్బంది గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పేకాట స్థావరంపై దాడులు

మర్రిపాడు: మండలంలోని అల్లంపాడులో పేకాట స్థావరంపై దాడులను ఎస్సై బలరామ్‌రెడ్డి గురువారం చేపట్టారు. పేకాటాడుతున్న ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.19,650ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై స్పష్టం చేశారు.

‘అపోలో’లో మహిళకు అరుదైన శస్త్రచికిత్స

నెల్లూరు(అర్బన్‌): అత్యంత క్లిష్టమైన పరిస్థితులను అధిగమించి బైకార్నుయేట్‌ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు అరుదైన ఆపరేషన్‌ చేసి తల్లీబిడ్డను తమ ఆస్పత్రిలో కాపాడామని అపోలో ఆస్పత్రి సీనియర్‌ గైనకాలజిస్ట్‌ లక్ష్మీదుర్గ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఆస్పత్రిలో గురువారం ఆమె తెలియజేశారు. నగర శివారు ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల మహిళ 25 వారాల గర్భంతో తీవ్రమైన నడుము నొప్పి, ఉమ్మనీరు లీకవడం, వాంతులతో రెండు వారాల క్రితం తమ ఆస్పత్రికి వచ్చారని వివరించారు. తాము పరీక్షలు చేయగా, పుట్టుకతోనే రెండు భాగాలుగా ఉండే అరుదైన బైకార్నుయేట్‌ యుటెరస్‌ (గర్భాశయం) కలిగి ఉందనే అంశాన్ని గుర్తించామని చెప్పారు. గర్భం దాల్చిన వారికి ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అన్నారు. తాము అత్యవసరంగా ఆపరేషన్‌ చేసి ఆడ శిశువుకు పురుడు పోశామని తెలిపారు. అయితే నవజాత శిశువు 700 గ్రాముల బరువే ఉండటంతో నియోనేటల్‌ ఐసీయూలో ఉంచి చికిత్సను అందించామని వెల్లడించారు. చిన్నారి క్రమంగా కోలుకొని బరువు పెరిగిందని, దీంతో వీరిని డిశ్చార్జి చేస్తున్నామని తెలిపారు. డాక్టర్లను ఆస్పత్రి యూనిట్‌ హెడ్‌ విశ్వేశ్వరరెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ శ్రీరామ్‌సతీష్‌ అభినందించారు. చిన్నపిల్లల వైద్యులు రాజశేఖర్‌రెడ్డి, రఫీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement