● కళ్లలో కారం చల్లి, గొంతుకోసిన వైనం
● గంటల వ్యవధిలోనే నిందితుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): తమ అన్నను చంపాడనే కక్షతో ఓ రౌడీషీటర్‌పై హత్యాయత్నానికి ఇద్దరు పాల్పడిన ఘటన నవాబుపేటలోని మహాలక్ష్మమ్మగుడి ఎదురుగా గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కుసుమ దళితవాడకు చెందిన మర్లపాటి ప్రదీప్‌పై నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్లో రౌడీషీట్ ఉంది. భార్య, పిల్లల నుంచి విడిపోయిన ఈయన కొన్నేళ్లుగా పొర్లుకట్టలో తల్లి రమణమ్మతో కలిసి ఉంటూ ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నారు. దాదాపు 15 రోజుల క్రితం శివదీక్షను చేపట్టారు. తనకు తెలిసిన వ్యక్తి మృతి చెందడంతో మాలను తీసేసి తన ఆటోలో కుసుమ దళితవాడకు వెళ్లారు. అక్కడ అదే ప్రాంతానికి చెందిన సోదరులు సాయి, సునీల్‌తో గొడవపడి.. ఆటోలో ఇంటికి బయల్దేరారు. వెంబడించిన సాయి, సునీల్.. మహాలక్షమ్మ గుడి వద్ద ఆటోలో ఎక్కారు. ఆపై ప్రదీప్ కళ్లలో కారం చల్లి కత్తితో గొంతుకోసి పరారయ్యారు. సమాచారం అందుకున్న నవాబుపేట ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెంటనే చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ప్రదీప్‌ను 108లో జీజీహెచ్‌కు.. మెరుగైన వైద్యం నిమిత్తం కిమ్స్ వైద్యశాలకు తరలించారు. తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసును నమోదు చేశారు. నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌తో పాటు నగర ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసరావు, సోమయ్య, కల్యాణరాజు, కోటేశ్వరరావు, సాంబశివరావు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. గంటల వ్యవధిలోనే పాత చెక్‌పోస్ట్ సమీపంలోని పెన్నా బ్రిడ్జి వద్ద అరెస్ట్ చేశారు. నవాబుపేట పోలీస్‌స్టేషన్లో కేసు పూర్వాపరాలను ఏఎస్పీ దీక్ష వెల్లడించారు.
అన్నను చంపాడనే కక్షతోనే..
కుసుమ దళితవాడకు చెందిన ప్రదీప్, మోషే స్నేహితులు. ఓ మహిళ విషయమై వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలో 2022లో మోషే హత్యకు గురయ్యారు. ఆ కేసులో ప్రదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మోషే తమ్ముళ్లు సాయి, సునీల్.. ప్రదీప్‌పై కక్ష పెంచుకొని అదను కోసం వేచిచూడసాగారు. కుసుమ దళితవాడ నుంచి ఇంటికెళ్తుండగా, హత్యాయత్నానికి నిందితులు పాల్పడ్డారని తెలిపారు.


