జిల్లాలో సర్కారు జూనియర్ కళాశాలల పరిస్థితి దారుణంగా ఉంది. రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కూటమి ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేపట్టక కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చర్లలతోనే బోధన సాగిస్తోంది. దీంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని దుస్థితి నెలకొంది. ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులను కూడా భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు క్రీడలకు సైతం దూరమవుతున్నారు.
ఎలాంటి
ఆటంకం లేదు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనకు ఎలాంటి ఆటంకం లేదు. పూర్తి స్థాయిలో అధ్యాపకులు ఉన్నారు. ఉద్యోగ విరమణ పొందిన అధ్యాపకుల స్థానంలో గెస్ట్ లెక్చరర్లను నియమిస్తున్నాం. రెగ్యులర్ అధ్యాపకుల నియామకం కూడా ప్రభుత్వం చేపట్టనుంది. జూనియర్ కళాశాలల్లో పీడీలు లేని మాట వాస్తవమే. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం.
– రాజశేఖరరెడ్డి,
జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి
నెల్లూరు (టౌన్) : ప్రభుత్వ విద్యకు కూటమి ప్రభుత్వం తిలోదకాలు ఇస్తుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. పేద, మధ్య తరగతి విద్యార్థులు చదవుకునే ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యమైన విద్యను అందించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకుల సంఖ్య ప్రతి ఏడాది తగ్గిపోతోంది. రెగ్యులర్ అధ్యాపకుల స్థానంలో కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లను నియమించి కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకొంటుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీంతో పాటు క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తున్నామని ఓ వైపు ప్రకటనలు గుప్పిస్తూ మరోవైపు జూనియర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ల నియామకానికి పూర్తిగా మంగళం పాడింది. జిల్లాలోని 25 ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలల్లో ఒక్క ఫిజికల్ డైరెక్టర్ మాత్రమే ఉండడం అందుకు నిదర్శనం.
కాంట్రాక్ట్, గెస్ట్‌ఫ్యాకల్టీలతోనే..
జిల్లాలో 25 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉన్నాయి. అందులో 22 ప్రభుత్వ, 3 ఎయిడెడ్, 1 మున్సిపల్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 325 అధ్యాపక పోస్టులు ఉండగా, 112 మంది రెగ్యులర్, 161 మంది కాంట్రాక్ట్, 52 మంది గెస్ట్‌లెక్చరర్లు పనిచేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 6,910 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి నాణ్యమైన విద్య అందాలంటే క్వాలిఫైడ్ రెగ్యులర్ అధ్యాపకులు అవసరం. అయితే కూటమి ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా రెగ్యులర్ అధ్యాపకుల స్థానంలో కాంట్రాక్ట్, గెస్ట్‌లెక్చరర్లను నియమించి బోధన సాగిస్తోంది. రెగ్యులర్ అధ్యాపకులకు రూ.లక్షల్లో జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. అదే కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లకు వేతనం రూ.30 వేల నుంచి రూ.40వేలు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం కాంట్రాక్ట్ అధ్యాపకులను కూడా పక్కన బెట్టి గెస్ట్‌లెక్చరర్లును నియమిస్తున్నారు. వీరికి గంటకు రూ.375 చొప్పున నెలకు 72 పిరియడ్ల బోధనకు రూ.27 వేలు మాత్రమే వేతనంగా ఇస్తున్నారు. అది కూడా 11 నెలలు మాత్రమే చెల్లిస్తున్నారు.
జిల్లాలో ఒక్కరే ఫిజికల్ డైరెక్టర్
జిల్లాలోని 25 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కలిపి ఒక్కరే ఫిజికల్ డైరెక్టర్ ఉన్నారు. నగరంలోని కేఏసీ జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పీ వేణుగోపాల్‌రెడ్డి కూడా వచ్చే ఏడాది సెప్టెంబరులో ఉద్యోగ విమరణ పొందనున్నారు. ఆ తరువాత జూనియర్ కళాశాలల్లో పీడీలు లేని జిల్లాగా మారనుంది. కూటమి ప్రభుత్వం మాత్రం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తోంది. ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్లు ప్రకటించామని గొప్పలు చెప్పుకుంటోంది. పాఠశాల స్థాయిలో క్రీడారంగంలో రాణించిన క్రీడాకారులు జూనియర్ కళాశాలలకు వచ్చే సరికి క్రీడలకు పూర్తిగా దూరమవుతున్నారు. ఫిజికల్ డైరెక్టర్లు లేకపోవడంతో కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఉంది. గతంలో పాఠశాలల్లో పీఈటీలుగా పనిచేస్తున్న వారికి పదోన్నతి కల్పించి పీడీలుగా నియామకం చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పీడీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో పాఠశాల స్థాయిలోనే పీఈటీలు ఉద్యోగ విరమణ పొందుతున్న పరిస్థితి ఉంది. చదువుతో పాటు క్రీడల్లో రాణించి ప్రభుత్వ ఉద్యోగం సాధిద్దామని ఆశపడుతున్న విద్యార్థులు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. ఇప్పటికై నా పేద విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పూర్తి స్థాయిలో రెగ్యులర్ అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లను నియమించాలని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో
రెగ్యులర్ అధ్యాపకుల కొరత
నియామకాలపై దృష్టి
సారించని ప్రభుత్వం
కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లతోనే బోధన
విద్యార్థులకు అందని నాణ్యమైన విద్య
జిల్లాలోని 25 జూనియర్
కళాశాలలకు ఒక్కరే పీడీ
ఆయన కూడా వచ్చే ఏడాదిలో
ఉద్యోగ విరమణ
క్రీడా రంగానికి ప్రాధాన్యత ప్రభుత్వ ప్రకటనలకే పరిమితం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 25 మంది రెగ్యులర్ అధ్యాపకులకు డిగ్రీ కళాశాలల అధ్యాపకులుగా ఈ ఏడాది జూలైలో పదోన్నతి కల్పించారు. అయితే ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పదోన్నతి పొందిన అధ్యాపకులు జూనియర్ కళాశాలల్లోనే పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది వీరంతో డిగ్రీ కళాశాలలకు వెళ్లనున్నారు. వీరి స్థానంలో గెస్ట్ లెక్చరర్లును నియమించనున్నారు.


