సోమిరెడ్డికి విమర్శించే అర్హత లేదు | - | Sakshi
Sakshi News home page

సోమిరెడ్డికి విమర్శించే అర్హత లేదు

Sep 24 2026 2:24 AM | Updated on Sep 24 2026 2:24 AM

పొదలకూరు : మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత సోమిరెడ్డికి లేదని, నైతిక విలువలు లేని ఆయన డీఎస్సీపై అవగాహన లేకుండానే మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లి, వెంకటాచలం మండలం తిరుమలమ్మపాళెం గ్రామాల్లో కాకాణి బుధవారం పర్యటించారు. చెన్నారెడ్డిపల్లిలో కోడూరు సుందరరామిరెడ్డి భౌతికాయాన్ని సందర్శించి కాకాణి నివాళులర్పించారు. తిరుమలమ్మపాళెంలో ఇటీవల మృతి చెందిన ముంగర వెంకటసుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ స్పోర్ట్స్‌ కోటా అక్రమాలపై విచారణకు వెనుకాడుతూ కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని విమర్శించారు. చదువు, సంధ్య లేని సోమిరెడ్డి డీఎస్సీ ఉద్యోగాలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగినట్టు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా జగన్‌మోహన్‌రెడ్డిని సోమిరెడ్డి విమర్శించడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. లోకేశ్‌ రాజీనామా చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని, ప్రశ్నించిన వారిపై గుండాలతో దాడులకు పాల్పడుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. పేదల గృహ నిర్మాణాలు, రీసర్వే అంశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అడ్డగోలు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో సోమిరెడ్డి కొత్త నాటకాలకు తెరలేపుతున్నాడని, ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం పేదల గృహాలు, రీసర్వే అంశాలను ప్రస్తావిస్తున్నారని విమర్శించారు.

న్యాయపరంగా ఎదుర్కొంటాం

తమ ప్రభుత్వ హయాంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లను సోమిరెడ్డి నిర్మించుకోనీయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాకాణి ఆరోపించారు. అధికారులు సైతం పేదల ప్లాట్లను రద్దు చేసి టీడీపీ వారికి అందజేసేందుకు సహకరిస్తున్నారన్నారు. దీనిపై న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పట్టాలు పొందిన లబ్ధిదారులకు గృహ నిర్మాణ శాఖ అధికారులు కాలనీ మంజూరు పత్రాలు అందజేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భూముల రీసర్వే లోపభూయిష్టంగా మారిందని, వీఆర్వోలు, తహసీల్దార్లు సర్వే రికార్డుల్లో పేర్లు మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రీసర్వే అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తామన్నారు. గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు సొంత నిధులతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారని, వారి సామాజిక బాధ్యతను అభినందిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో తమ పార్టీ నాయకులు చేస్తున్న సేవలను చూసి ప్రభుత్వ పెద్దలు సిగ్గుపడాలన్నారు. నాయకులు కోడూరు ఆనంద్‌రెడ్డి, నోటి బాలకొండారెడ్డి, నీలం మాల్యాద్రిరెడ్డి, వి.లింగారెడ్డి, ఎం.వెంకటశేషయ్య తదితరులు ఉన్నారు.

డీఎస్సీపై అవగాహన

లేకుండానే జగన్‌పై విమర్శలా

స్పోర్ట్స్‌ కోటా అక్రమాలపై

డైవర్షన్‌ రాజకీయాలు

పేదల స్థలాల జోలికొస్తే

ఉద్యమం చేపడతాం

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement