నెల్లూరు(పొగతోట): ఐదేళ్ల పాలనలో జరగని అవమానం జెడ్పీటీసీలకు చివరి రోజుల్లో జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు అందుబాటులోనే ఉన్నా అందరూ పథకం ప్రకారమే జెడ్పీ చివరి సర్వసభ్య సమావేశానికి మూకుమ్మడిగా గైర్హాజరయ్యారు. గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన సభలో జెడ్పీటీసీలను ఘోరంగా అవమానపరిచారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అందరికీ సమన్యాయం చేశారు. అందుబాటులో ఉన్న నిధులతో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. చివరి సమావేశంలో మండలాల్లోని సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోటి ఆశలతో జెడ్పీటీసీలు సమావేశానికి హాజరయ్యారు. అయితే జిల్లా అధికారులు, జెడ్పీ అధికారులు సమావేశానికి హాజరుకాకుండా వ్యవహరించిన తీరుకు జెడ్పీటీసీలు నివ్వెరపోయారు. రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి ఘటనలు జరిగి ఉండవు. జెడ్పీ చరిత్రలో ఇది ఒక చీకటి రోజుగా నిలిచింది.
ముందుగానే అనుమతి తీసుకున్నా..
జెడ్పీలో నిర్వహించే స్థాయీ సంఘాల, సర్వసభ్య సమావేశాల నిర్వహణను జెడ్పీ చైర్‌పర్సన్, జెడ్పీ అధికారులు కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 17న నిర్వహించ తలపెట్టిన సర్వసభ్య సమావేశానికి జిల్లా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ అనుమతి 20 రోజుల కిందట తీసుకున్నారు. ఆ రోజు సమావేశం జరుగుతుందని అందరికీ ముందుగానే సమాచారం ఇచ్చారు. అందరూ జిల్లాలోనే అందుబాటులో ఉన్నా సమావేశానికి కావాలనే గైర్హాజరయ్యారు. ఈ నెల 22న అత్యవసర సమావేశం నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు వాటిని పట్టించుకోలేదు. ఇప్పటి వరకు 30 మంది జెడ్పీ చైర్మన్లుగా పనిచేశారు. ఏ పాలకవర్గానికి ఇంతగా అవమానం జరగలేదు. 31వ చైర్‌పర్సన్‌ను ఉద్దేశపుర్వకంగానే అవమానించిట్లుగా సమాచారం. కలెక్టర్ అందుబాటులో లేకపోతే జాయింట్ కలెక్టర్ అయినా సమావేశానికి హాజరయ్యే వారు. కలెక్టర్ అందుబాటులో ఉన్నా సమావేశానికి హాజరకాలేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 46 మండలాల జెడ్పీటీసీలు అందరూ వైఎస్సార్‌సీపీకి చెందిన వారే. ఈ విషయం మింగుడుపడని కూటమి నేతలు కావాలనే చివరి సమావేశానికి హాజరుకాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జెడ్పీ సీఈఓ ఈ రోజు వరకు విధులకు హాజరుకాలేదు. కలెక్టరేట్ ఉద్యోగులు విధులకు అలస్యంగా వస్తున్నారని కలెక్టరేట్ గేటుకు తాళాలు వేయించారు. అటువంటిది జెడ్పీ సీఈఓ ఇన్ని రోజులు విధులకు హాజరుకాకపోవడం అనే విషయం జిల్లా అధికారికి తెలుసా..తెలియదా..? జెడ్పీకీ సంబంధించి జెడ్పీ సీఈఓ సెలవు పెడితే డిప్యూటీ సీఓఓకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తారు. డిప్యూటీ సీఈఓ సెలవులో ఉన్నారు. వారిద్దరు సెలవులో ఉన్నప్పుడు డీపీఓ లేదా ఇతర జిల్లా అఽధికారులకు ఎవరికై నా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించవచ్చు. అటువంటిది ఏమిలేకుండా అధికారులు 46 మంది జెడ్పీటీసీలను ఘోరంగా అవమానించారు. వారిలో 24 మంది మహిళలు ఉన్నారు. 46 మంది ఎంపీపీల్లో 31 మంది మహిళలు ఉన్నారు. అందరిని కావాలనే అవమానించారు. ఈ నెల 24తో జెడ్పీటీసీల పదవీ కాలం ముగియనుంది. 25 నుంచి జెడ్పీ అధికారులందరూ విధులకు హాజరవుతున్నట్లు సమాచారం.
రేపటి నుంచి ప్రత్యేక పాలన
జెడ్పీటీసీల పదవీ కాలం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి ప్రత్యేకాఽధికారులు పాలనలో జెడ్పీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జెడ్పీకి జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు. మండలాలకు ప్రత్యేక కలెక్టర్లు, డివిజన్ స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. జెడ్పీకి ఎన్నికల ప్రక్రియ పూర్తయి నూతన పాలకవర్గం ఏర్పడే వరకు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.
అందుబాటులోనే
అధికారులు, ప్రజాప్రతినిధులు
అయినా జెడ్పీటీసీలకు వీడ్కోలు పలకని వైనం
నేటితో ముగియనున్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీల పదవీ కాలం
రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన
జెడ్పీకి ప్రత్యేకాధికారిగా కలెక్టర్ హిమాన్షు శుక్లా


