ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

Sep 4 2026 12:24 AM | Updated on Sep 4 2026 12:24 AM

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30వ తేదీ వరకు గడువు పెంచినట్లు బీడీ కార్మికుల సంక్షేమ నిధి వైద్యశాల సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కేవీ భాస్కర్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని బీడీ, మైకా, డోలమైట్‌ తదితర గనుల కార్మికుల పిల్లలు ప్రీ మెట్రిక్‌ విభాగంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈనెల 30వ తేదీ వరకు పెంచారన్నారు. అదేవిధంగా పోస్ట్‌ మెట్రిక్‌ విభాగంలో చదువుతున్న పిల్లలు అక్టోబర్‌ 31వ తేదీలోపు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు నగరంలోని జెడ్పీ కాలనీలోని బీడీ కార్మికుల సంక్షేమనిధి వైద్యశాల సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ను సంప్రదించాలని కోరారు.

కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్‌

సైదాపురం: రటాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని, రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆటోను తీయమని చెప్పిన కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన వ్యక్తిని సైదాపురం పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. శ్రీకాళహస్తిలో ఇటీవల ఓ కానిస్టేబుల్‌పై వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన మరువకముందే సైదాపురంలో అదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు కానిస్టేబుల్‌ ప్రేమ్‌కుమార్‌పై దాడికి పాల్పడిన మచ్చా వెంకటేశ్వర్లును సైదాపురం పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రాపూరు సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌ నుంచి దాడి జరిగిన ఘటనా స్థలం వద్దకు, అక్కడి నుంచి మళ్లీ సైదాపురం పోలీస్‌స్టేషన్‌ వరకు నిందితుడు వెంకటేశ్వర్లును నడిపించుకుంటూ తీసుకెళ్లారు. దాడికి సంబంధించి స్థానికులను అడిగి క్షేత్రస్థాయిలో వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు.

ఆంజనేయపురంలో పడవ దగ్ధం

పరిహారం కోసం జేడీకి వినతి

విడవలూరు: పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన మండలంలోని ఆంజనేయపురం గ్రామంలో బుధవారం జరిగింది. బాధితుల వివరాల మేరకు.. మండలంలోని రామతీర్థం పంచాయతీ ఆంజనేయపురం గ్రామానికి చెందిన మత్స్యకారుడు పామంజి నరసింహ బుధవారం తన పడవలో చేపల వేటకు వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. పడవలో వంటకోసం పెట్టిన గ్యాస్‌ లీకై , పక్కన ఉన్న డీజిల్‌ క్యాన్‌కు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి పడవతో పాటు అందులో ఉన్న రూ.లక్షల విలువైన వేట వలలు, సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న మత్స్యకార నాయకులు ఆవుల వాసు, కొండూరు పోలిశెట్టి బాధితులతో కలిసి గురువారం నెలూరులోని మత్స్యకార జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మణరావును ఆయన కార్యాలయంలో కలిసి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement