● అధికారులను నిలదీసిన రైతులు
● తెలుగు గంగ కార్యాలయ ముట్టడి
కలువాయి(సైదాపురం): రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని పండించిన పంట చివరి దశలో సాగు నీరందక ఎండిపోతున్నాయని, తమ పొలాలకు నీరందించకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటూ మండలంలోని కనుపూరుపల్లి రైతులు అధికారులను నిలదీశారు. ఈ మేరకు వారు గురువారం తెలుగు గంగ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని ముట్టడించారు.
వెయ్యి ఎకరాల్లో సాగు
సోమశిల దక్షిణ కాలువ 8ఎల్ కింద సుమారు వెయ్యి ఎకరాల్లో వరి పంటను కనుపూరుపల్లి రైతులు సాగు చేస్తున్నారు. వరి వెన్ను దశలో ఉండగా ప్రస్తుతం చుక్కనీరు అందకపోవడంతో వరి పైరు తమ కళ్లెదుటే ఎండిపోతుండటంతో ఆవేదన చెందిన అన్నదాతలు తమ గోడును అధికారులకు విన్నవించుకునేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. నెల్లూరులో ఇటీవల జరిగిన ఐఏబీ సమావేశంలో చివరి పంట వరకు సాగునీరందిస్తామని చెప్పిన కూటమి నేతలు నిలువునా మోసం చేశారని వాపోయారు. అప్పులు చేసి పంటలను సాగు చేసుకుని పంట చేతికొచ్చే సమయంలో నష్టపోయే పరిస్థితులు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు స్పందించికపోతే రానున్న రోజుల్లో తాము కూడా బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు.
చర్యలు తీసుకుంటాం
సోమశిల జలాశయం నుంచి పంట కాలువ ద్వారా సాగునీరందిస్తున్నాం. ఎల్‌నినో ప్రభావం కారణంగా నీటి విడుదల తగ్గింది. ప్రస్తుతం 300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నాం. దీనిని 500 క్యూసెక్కులకు పెంచేలా ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.
– మస్తానయ్య, డీఈ


