ఉద్యోగుల సత్తా చూపిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సత్తా చూపిస్తాం

Sep 4 2026 12:24 AM | Updated on Sep 4 2026 12:24 AM

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో

నల్లబ్యాడ్జీలతో నిరసన

నెల్లూరు(అర్బన్‌): కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు ఏదో చేస్తుందని భావించామని, రెండున్నరేళ్లు అయినా తమను పట్టించుకోలేదని ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ అల్లంపాటి పెంచలరెడ్డి అన్నారు. అందుకే ఉద్యోగుల ఉద్యమ సత్తా చూపించి ప్రభుత్వ మెడలు వంచుతామని పేర్కొన్నారు. పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని, పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలని, అంతవరకు న్యాయమైన ఐఆర్‌ ఇవ్వాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. నగరంలోని కలెక్టరేట్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. అలాగే నగరంలోని ఆర్డీఓ, ఆర్‌అండ్‌బీ, పశుసంవర్థక శాఖ, ఇరిగేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయం, వ్యవసాయ శాఖ ఇలా పలు కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నిరసన జరిగింది. ఈ సందర్భంగా పెంచలరెడ్డి నెల్లూరులో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగులకు 30 వేల కోట్లకు పైగా బకాయిలు ఉందన్నారు. తమకు పీఆర్సీ ఇవ్వనందున ప్రతి ఉద్యోగి రూ.లక్షల్లోనే నష్టపోతున్నారన్నారు. తాము ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామన్నారు. ఎన్నో వినతి పత్రాలిచ్చామన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకుండా నాన్చుడి ధోరణితో కాలం వెళ్ల బుచ్చుతోందన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే దశల వారీగా ఉద్యమించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుని పోరుబాట పట్టామన్నారు. కార్యక్రమాల్లో జేఏసీ జిల్లా కార్యదర్శి ఓవీ ప్రసాద్‌, మహిళా విభాగం చైర్‌పర్సన్‌ బాలకోటమ్మ, కో చైర్‌పర్సన్‌ శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement