గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇచ్చిన రూ.22 లక్షల ఫండ్స్‌తో స్కిల్ డెవలప్‌మెంట్ భవనాన్ని నిర్మించారు. అయితే ఇది నేటికీ నిరుపయోగంగా దర్శనమిస్తోంది.
బోధనేతర సిబ్బంది గదుల్లో ఏసీలను బిగించి.. అధ్యాపకులుండే చోట మాత్రం విస్మరించారు.
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. ఈమెకు ఈ హోదా ఇచ్చి రెండేళ్లు దాటింది. అనేక ఆరోపణలు రాగా, శాశ్వత సీఈని నియమించాల్సి ఉన్నా, అవేవీ పట్టడంలేదు. పైగా అనుభవం లేని అడిషనల్ కంట్రోలర్‌కు బాధ్యతలను అప్పగించారు.
వీఎస్‌యూలో ప్రిన్సిపల్ పోస్టు కీలకం. యూజీసీ నిబంధనల మేరకు దీనికి రెండేళ్ల కాలపరిమితి ఉండాలి. అయితే ప్రస్తుతం కెమిస్ట్రీ విభాగ ప్రొఫెసర్ వీరారెడ్డిని ప్రిన్సిపల్‌గా నియమించి ఏడాది మాత్రమే ఇచ్చారు.
30 మందికిపైగా గెస్ట్ లెక్చరర్లుండగా, వీరిని రెన్యువల్ చేయకపోవడంతో రెండు నెలలుగా జీతాలు రాని పరిస్థితి నెలకొంది. యూజీసీ రూల్స్‌కు విరుద్ధంగా వీరి నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ప్రక్రియను రద్దు చేశారు.
మైరెన్ బయాలజీ విభాగంలో గిరిజన మహిళ గెస్ట్ ఫ్యాకల్టీ కన్సాలిడేటెడ్‌గా పనిచేస్తున్నారు. వర్క్‌లోడ్ లేదనే కారణంతో ఈమెను తొలగించారు. కేవలం ఆ విభాగ హెచ్‌ఓడీ ఒత్తిడితోనే ఇలా చేశారని తెలిసింది.
నాన్ టీచింగ్ సిబ్బంది పదోన్నతులు ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీనిపై గతంలో సాక్షిలో కథనం సైతం ప్రచురితమైంది.
ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే చిన్న కాంట్రాక్ట్ పనులను సైతం అనుకూలంగా ఉన్న వారికి కట్టబెడుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.
ఇంజినీరింగ్ విభాగానికి ఇటీవల అనుమతి వచ్చింది. దీనికి డైరెక్టర్‌గా సైన్స్ విభాగానికి చెందిన విజయను నియమించారు. ఏఐసీటీఈ నిబంధనల మేరకు బీటెక్, ఎంటెక్ ఉన్న వారినే నియమించాల్సి ఉన్నా, పట్టించుకోలేదు.
దూర విద్యను ప్రారంభించేందుకు యత్నించారు. అయితే సరైన నిబంధనలను పాటించకపోవడం, అవగాహన లోపంతో దీన్ని కోల్పోవాల్సి వచ్చింది.
కిచెన్ గార్డెన్, బెస్ట్ ప్రాక్టీసెస్ కన్వీనర్‌గా ఒకే వ్యక్తి నాలుగైదేళ్లుగా పనిచేస్తున్నారు. అయితే ఆయనకు తెలియకుండానే కమిటీని రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ పేరుపై పూర్తిగా మార్చేశారు. విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లినా, సాకులు చెప్తున్నారు. ఫలితంగా గ్రీనరీ పూర్తిగా పాడైపోయింది. దీనికి బెస్ట్ టీచర్ అవార్డుకు మార్కులుండటంతో మార్చేశారని తెలిసింది.
రిజిస్ట్రార్ ఉత్సవ విగ్రహంగా మారారనే అపవాదూ ఉంది. ఈమెను నియమించి రెండేళ్లు దాటినా, శాశ్వత రిజిస్ట్రార్‌ను నియమించే పరిస్థితి లేదు. మరోవైపు ఢిల్లీ యూనివర్సిటీకి వీసీగా ఇక్కడి వైస్ చాన్సలర్ వెళ్లేందుకు యత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
విక్రమ సింహపురి యూనివర్సిటీ
అసంబద్ధ నిర్ణయాలు
వర్సిటీలో అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటుండటంతో అర్హులకు అన్యాయం జరుగుతోంది. వాస్తవానికి ఇక్కడ 2013లో నియమితులైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ కింద పదోన్నతులు కల్పించాల్సి ఉన్నా, ఇవి నేటికీ పెండింగ్‌లో ఉన్నాయి. నోటిఫికేషన్ అనంతరం అభ్యర్థులు దరఖాస్తు చేసినా, వాటిని స్క్రూట్నీ చేయలేదు. మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులిచ్చి ఈసీలో అనుమతి పొంది వారిని అపాయింట్ చేశారు. ఒకే వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఒకలా.. అసోసియేట్ ప్రొఫెసర్లకు మరో న్యాయం జరుగుతుండటంపై విమర్శలొస్తున్నాయి. జీతభత్యాల్లోనూ వీరికి నష్టం వాటిల్లుతోంది.
వర్సిటీలో అస్తవ్యస్తంగా పాలన
జిల్లాకే తలమానికమైన విక్రమ సింహపురి యూనివర్సిటీలో సమస్యలు క్యూ కడుతున్నాయి. ఇక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు విశ్వవిద్యాలయ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి. పాలన అస్తవ్యస్తంగా మారినా, దాన్ని గాడిన పెట్టేలా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. అర్హులను విస్మరిస్తూ.. అనర్హులను అందలమెక్కిస్తున్నారనే ఆరోపణలను మూటగట్టుకుంటోంది. వీసీ పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో ఇక్కడ ఆడిందే ఆట.. పాడిందే పాట అనే చందంగా పరిస్థితి మారింది. ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లిపోవాలనే యత్నాల్లో వైస్ చాన్సలర్ ఉండటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే టాక్ స్థానికంగా నడుస్తోంది.
గందరగోళంగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విభాగం
నిరుపయోగంగా
స్కిల్ సెంటర్ భవనం
యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు
పనులు సైతం పెండింగ్‌లో
పూర్తిస్థాయిలో దృష్టి సారించని వీసీ
తీవ్ర అసంతృప్తి
వర్సిటీలో ఎస్టాబ్లిష్‌మెంట్, పర్చేజ్ విభాగాలు చాలా కీలకం. గతంలో ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఉన్న నాన్ టీచింగ్ ఉద్యోగి వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. ఆ సమయంలో దీన్నీ పర్యవేక్షించాల్సిందిగా పర్చేజ్‌ను చూసే వ్యక్తికి ఆదేశాలు జారీ చేశారు. సెలవుపై వెళ్లిన ఉద్యోగి తిరిగొచ్చినా, ఆయనకు ఎస్టాబ్లిష్‌మెంట్ బాధ్యతలను అప్పగించలేదు. సదరు వ్యక్తే ఇన్‌చార్జిగా ఇప్పటికీ వ్యవహరిస్తుండటంతో కొన్ని ఫైళ్లు ఆగిపోతున్నాయి. ఈ విషయమై వీసీకి నాన్ టీచింగ్ సిబ్బంది ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం.
నెల్లూరు (టౌన్): విక్రమ సింహపురి యూనివర్సిటీలో పాలన గాడితప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీసీ పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శా లేకపోలేదు. ఇక్కడ పనిచేస్తున్న కొంతమంది విభాగాధిపతులు, అధ్యాపకుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో అర్హులకు అన్యాయం జరుగుతోందనే భావన పలువురిలో నెలకొంది.
తప్పులతడకగా మూల్యాంకనం
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విభాగం పూర్తిగా గాడి తప్పింది. లా విద్య, పీజీ తదితర జవాబు పత్రాల మూల్యాంకనాన్ని తప్పులతడకగా చేశారంటూ పలు విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమను అవమానాలకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేరని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరవధిక నిరసన దీక్షలను కాంట్రాక్ట్ అధ్యాపకులు వారం పాటు నిర్వహించినా, కనీసం వీరిని పిలిచి మాట్లాడిన దాఖలాల్లేవు.
సంబంధంలేని వారి నియామకం
వర్సిటీలోని కొన్ని విభాగాల్లో శాశ్వత అధ్యాపకుల్లేరు. ఈ డిపార్ట్‌మెంట్లలోని పర్మనెంట్ వారిని ఇన్‌చార్జి హెడ్లుగా నియమించాలి. అయితే సంబంధంలేని వారిని అపాయింట్ చేశారు. హెడ్లుగా రెండేళ్ల కాలపరిమితి ఉంటుంది. అయితే అది ముగిసినా, కొన్ని డిపార్ట్‌మెంట్లలో అనుకూలంగా ఉన్న వారినే తిరిగి కొనసాగిస్తున్నారు.
అన్నీ అగచాట్లే..
వర్సిటీలో ఏర్పాటు చేసిన కాంపిటీటివ్ సెల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు డైరెక్టర్ హోదా కల్పించి నియమించారు. యూజీసీ నిబంధనల మేరకు ప్రొఫెసర్‌కే అవకాశం కల్పించాలి. చాలా మంది ఉన్నా, ఇలా నిర్ణయం తీసుకోవడంపై ఇక్కడి వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎండోమెంట్ సెల్‌ను ఏర్పాటు చేసి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమించారు. ఒకే హోదా కలిగిన వ్యక్తులను ఒక్కోలా నియమించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.
నిబంధనల మేరకే..
వర్సిటీలో అన్నింటినీ నిబంధనల మేరకే చేస్తున్నాం. అసోసియేట్ ప్రొఫెసర్లకు సంబంధించిన ఫైల్ ప్రాసెస్‌లో ఉంది. ఇంజినీరింగ్ విభాగ డైరెక్టర్‌గా కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు ఇష్టపడకపోవడంతో విజయను నియమించాల్సి వచ్చింది. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్‌ను త్వరలో మార్చనున్నాం. ఈసీ అనుమతి పొందాల్సి ఉంది. మీటింగ్ జరగకపోవడంతో ఆలస్యమైంది. అవినీతిని ఎక్కడా ప్రోత్సహించేది లేదు. – అల్లం శ్రీనివాసరావు, వీసీ


